Prabhas Radhe Shyam believe in pushpaఅభిమానులు ఎప్పుడెప్పుడా అని నిరీక్షించిన “రాధే శ్యామ్” సినిమా సిల్వర్ స్క్రీన్ పై తారసపడింది. ఇండియన్ మూవీగా ప్రచారం గావించిన ఈ సినిమా ఎలా ఉంది? అన్న ఉత్సుకత సినీ ప్రేక్షకులలో నెలకొంది. యుఎస్ లో భారత కాలమాన ప్రకారం మిడ్ నైట్ 12 గంటలకే షోలు పడడంతో, మూడు గంటలకే సోషల్ మీడియా ‘రివ్యూ’లు వచ్చేసాయి.

సింపుల్ గా చెప్పాలంటే… గ్రాండ్ విజువల్స్, హస్త సాముద్రిక అనే కొత్తదనం, నిర్మాణ విలువలు, ప్రభాస్ నటన సంతృప్తికరంగా ఉన్నప్పటికీ, లవ్ స్టోరీగా జరిగిన ప్రచారం సిల్వర్ స్క్రీన్ పై పండలేదని విశ్లేషకులు తేల్చేసారు. ఒక లవ్ స్టోరీకి కావాల్సిన హీరో హీరోయిన్ల నడుమ కెమిస్ట్రీ వర్కౌట్ కాకపోవడం సినిమాకు ప్రధాన మైనస్ గా చెప్పుకొచ్చారు.

సోషల్ మీడియా టాక్ ఎలా ఉన్నప్పటికీ, ఇటీవల విడుదలైన పెద్ద సినిమాలన్నీ ఇలాంటి టాక్ తో మొదలయ్యి, బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించాయి. ‘అఖండ, పుష్ప’ సినిమాల సందర్భంలో కూడా సినీ విశ్లేషకులు ఆయా సినిమాలలోని లోటుపాటులను భారీ స్థాయిలో ఎత్తి చూపినప్పటికీ, ప్రేక్షకులు మాత్రం బాక్సాఫీస్ వద్ద నిలబెట్టారు.

ప్రస్తుతం “రాధే శ్యామ్” కూడా ‘పుష్ప’నే ఆదర్శంగా తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. సినిమాలో పాజిటివ్ సైడ్స్ ను పరిగణనలోకి తీసుకుని ప్రేక్షకుల చేత ‘ఓకే’ చేయించుకోగలిగితే, 25వ తేదీన ‘ఆర్ఆర్ఆర్’ వచ్చేవరకు ‘రాధే శ్యామ్’కు డోకా ఉండకపోవచ్చు. విశ్లేషకులు కధలోని లోపాలను అయితే చెప్పగలరు గానీ, ప్రేక్షకుల తీర్పును నిర్ణయించలేరు కదా!