Prabhas Radhe Shyam 5th Show issue“వకీల్ సాబ్”తో మొదలైన టికెట్ల రగడ, ఇటీవల “భీమ్లా నాయక్” విడుదల తర్వాత ఇచ్చిన కొత్త జీవోతో శుభంకార్డు పడిందని అంతా భావించారు. ఈ రెండు పవన్ కళ్యాణ్ సినిమాల నడుమ జరిగిన ఉదంతాలను పక్కన పెడితే, పవన్ సినిమాలే టార్గెట్ గా జగన్ సర్కార్ ఈ టికెట్ల రగడను రగిల్చింది అన్నది బహిరంగ విషయమే.

ఇటీవల “భీమ్లా నాయక్” విడుదల సమయంలో ఈ విషయం బలంగా ప్రేక్షకులలోకి వెళ్ళింది. బహుశా ఈ విమర్శలను తిప్పికొట్టడానికి జగన్ సర్కార్ కొత్త ఎత్తుగడ వేసిందేమో అనిపించే విధంగా “రాధే శ్యామ్”కు సంబంధించిన అనుమతుల విషయంలో జాప్యం జరుగుతోంది. ఓ పక్కన తెలంగాణ సర్కార్ అయిదవ షోకు సంబంధించిన అనుమతులు, టికెట్ ధరలకు సంబంధించి క్లియరెన్స్ ఇచ్చేసింది.

కానీ ఏపీలో మాత్రం బెనిఫిట్ షోకు దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. అలాగే ఆన్ లైన్ లో కూడా అన్ని థియేటర్లకు సంబంధించిన టికెట్లు అందుబాటులోకి రాలేదు. మొదటి షో ప్రారంభం కావడానికి పన్నెండు గంటల సమయం ఉన్న నేపథ్యంలో… ఇంకా స్పష్టత రాకపోవడంతో, ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానుల ఆక్రోశం ఎక్కువవుతోంది.

ఈ సందర్భంగా ఏపీ సర్కార్ తీరుపై మరోసారి విమర్శల వర్షం కురుస్తోంది. అలాగే చిత్ర నిర్మాణ సంస్థ అయిన యువీ క్రియేషన్స్ సంస్థ కూడా ట్రోల్స్ కు గురవుతోంది. ప్రభాస్ సినిమాను కూడా ఇబ్బందులు పెట్టడం ద్వారా, ఒక్క పవన్ కళ్యాణ్ సినిమాలనే కాదు, ఇతర హీరోల సినిమాలకు కూడా అదే రకమైన ట్రీట్మెంట్ ఇచ్చామని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఏపీ సర్కార్ భావిస్తోందా?

లేక తాడేపల్లి వచ్చిన సమయంలో ముఖ్యమంత్రి జగన్ ఎదురుగా ఉన్న ప్రభాస్ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంపై అసంతృప్తిగా ఉన్నారా? కొత్త జీవో వచ్చిన తర్వాత హీరో ప్రభాస్ పొగడ్తల వర్షం కురిపించలేదని భావిస్తోందా? విషయం ఏదైనా గానీ వైసీపీ సర్కార్ చెప్పేది అయితే ఒకటే కదా… పేదవాళ్లకు సినీ వినోదం అందుబాటులో ఉండాలని ఈ చర్యలన్నీ తీసుకుంటున్నామని!