Prabhas Brand Endorsementsఇండియా వ్యాప్తంగా పలు కార్పొరేట్ కంపెనీలకు ‘బ్రాండ్ అంబాసిడర్’గా ఉన్న ప్రిన్స్ మహేష్ బాబు, దక్షిణాది హీరోలలో అత్యధిక బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కోలీవుడ్ నుండి సూర్య వంటి హీరోలు ఉండగా, తెలుగులో మహేష్ తర్వాత స్థానం అల్లు అర్జున్ కు దక్కుతోంది. మహేష్ కు పోటీగా ఇప్పటికే పలు బ్రాండ్లకు ‘అంబాసిడర్’గా వ్యహరిస్తుండగా… ఇప్పుడు బరిలో తాను కూడా ఉన్నానంటూ సత్తా చాటుతున్నాడు ‘యంగ్ రెబల్ స్టార్’ ప్రభాస్.

‘బాహుబలి’ సినిమా ద్వారా లభించిన ఖ్యాతిని సద్వినియోగం చేసుకునే విధంగా పలు కార్పొరేట్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండబోతున్నాడు ప్రభాస్. ‘బాహుబలి 1’ విడుదలైన తర్వాత మహీంద్రా వంటి కంపెనీ తరపున ప్రచారకర్తగా నిలిచిన ప్రభాస్, తాజాగా ‘బాహుబలి 2’ తర్వాత ఓ మొబైల్ సంస్థకు ‘బ్రాండ్ అంబాసిడర్’గా ఉండేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆటో మొబైల్ రంగంలో మహేష్, అల్లు అర్జున్ లు పోటీ పడుతున్నప్పటికీ, ప్రభాస్ కార్ల రేంజ్ కు వెళ్ళాడు.

అయితే ఓ మొబైల్ సంస్థకు ‘బ్రాండ్ అంబాసిడర్’గా మాత్రం ఇప్పటివరకు ఏ తెలుగు హీరో కూడా లేకపోవడం విశేషం. దీంతో ఆ విశిష్టతను సొంతం చేసుకున్న తొలి హీరోగా యంగ్ రెబల్ స్టార్ రికార్డులకెక్కబోతున్నాడు. ‘బాహుబలి 2’ విజయం తర్వాత ఎన్నో కంపెనీలు ప్రభాస్ వెంటపడుతున్నా… వాటికి ఓకే చెప్పకుండా ‘జియోనీ’ మొబైల్ కంపెనీకి ప్రచారకర్తగా ఉండేందుకు అంగీకారం తెలపడం విశేషం. ఇప్పటికే ఈ బ్రాండ్ ను విరాట్ కోహ్లి, శృతిహాసన్, అలియా భట్ తదితరులు ప్రమోట్ చేస్తుండగా, తాజాగా ప్రభాస్ వాళ్ళ సరసన చేరబోతున్నాడు.