Prabhas Balakrishna unstoppable Season 2ఊహించని విధంగా అన్ స్టాపబుల్ సెలబ్రిటీ ఇంటర్వ్యూ షోని బ్లాక్ బస్టర్ చేయడంలో బాలకృష్ణ పాత్ర ఎంత ఉందో చాలా త్వరగానే సీజన్ 2ని మొదలుపెట్టడం ద్వారా అర్థం చేసుకోవచ్చు. మాములుగా మీడియా కెమెరా ముందు తడబడే బాలయ్య ఇంత హుషారుగా నడిపించడం చూసి ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యపోయారు. దీని ప్రభావం ఎంతగా ఉందంటే ఆహా అధినేత అల్లు అరవింద్ ఎన్నడూ లేనంత క్లోజ్ గా ఇప్పుడు బాలకృష్ణతో కలిసిపోతున్నారు. శిరీష్ కొత్త సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా తీసుకొచ్చారు. అల్లు అర్జున్ ని మొదటి సిరీస్ లో అతిథిగా పంపించారు. ట్విట్టర్ లోనూ ఆహా ప్రమోషన్ ఎక్కువగా జై బాలయ్య నామజపంతోనే జరుగుతోంది.

ఇక్కడిదాకా బాగానే ఉంది కానీ రెండో సీజన్ మొదలయ్యాక సెలబ్రిటీల విషయంలో అప్పుడున్నంత జోష్ కనిపించడం లేదన్నది వాస్తవం. ఎన్నడూ లేనిది చంద్రబాబు నాయుడు లోకేష్ లను తీసుకొచ్చారు. అది పొలిటికల్ వర్గాల్లో కొంత మైలేజ్ తీసుకొచ్చింది కానీ సగటు మూవీ లవర్స్ కి ఈ రాజకీయాలనేవి అవసరం లేని వ్యవహారాలు. తిరిగి కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డిని తెచ్చినప్పుడూ ఇదే పొరపాటు రిపీట్ అయ్యింది. తోడుగా సీనియర్ హీరోయిన్ రాధికను తీసుకొచ్చినా పెద్దగా ప్రయోజనం కలగలేదు. శర్వానంద్, విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ, అడవి శేష్ వీళ్లంతా రావడం ప్లస్సే కానీ మార్కెట్ కోణంలో చూసుకుంటే మరీ పెద్ద రేంజ్ కాదు.

ఎప్పుడైతే ప్రభాస్ వస్తున్నాడని తెలిసిందో ఒక్కసారిగా అన్ స్టాపబుల్ ఫ్యాన్స్ లో ఉత్సాహం వచ్చేసింది. విపరీతమైన మొహమాటముండే డార్లింగ్ బాలయ్యతో ఏ విశేషాలు పంచుకుని ఉంటాడా అనే ఆసక్తి మొదలైపోయింది. తోడుగా బెస్ట్ ఫ్రెండ్ గోపీచంద్ ని జోడించడం కొత్త కళను తీసుకొచ్చింది. లీకుల సైతం బలంగా వదిలారు. సెట్లో అందరికీ ప్రభాస్ భోజనాలు తెప్పించడం, రామ్ చరణ్ కు వీడియో కాల్ చేసినప్పుడు త్వరలో ఒక గుడ్ న్యూస్ వింటారని సస్పెన్స్ పెట్టడం, పెళ్లి ప్రస్తావన రావడం ఇలా గట్టిగానే తిరుగుతున్నాయి. ఇంత హైప్ వచ్చినప్పుడు సహజంగానే అంచనాలు ఎక్కడికో వెళ్లిపోతాయి. ఇప్పుడదే జరుగుతోంది.

ఏదో పెద్ద సినిమా రిలీజవుతున్నంత హడావిడి ఈ ఎపిసోడ్ విషయంలో కనిపిస్తోంది. డిసెంబర్ 30 టెలికాస్ట్ అని అఫీషియల్ గా చెప్పలేదు కానీ ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టే. మూడో సీజన్ ప్లాన్ ఉంటే మాత్రం దానికి సరిపడా బూస్ట్ ఇవ్వాల్సింది ప్రభాసే. బాహుబలి తర్వాత బొత్తిగా నల్లపూసైన డార్లింగ్ సాహో, రాధే శ్యామ్ ఫలితాలతో నిరాశపరిచాడు. పైగా వాటి లుక్స్ కూడా ఫ్యాన్స్ కి అంతగా నచ్చలెదు. కానీ అన్ స్టాపబుల్ షూటింగ్ కు వేసుకొచ్చిన కాస్ట్యూమ్, హెయిర్ స్టైల్ ఒకరకంగా వింటేజ్ ప్రభాస్ ని గుర్తు చేశాయి. మరి బాలయ్య డార్లింగ్ లు కలిసి దీన్ని ఎలా రక్తి కట్టిస్తారో చూడాలి. ఎలాగూ తర్వాత పవన్ కళ్యాణ్ అంటున్నారు కాబట్టి ఇది పక్కా గ్రౌండ్ సెట్ చేస్తే సరి.