Prabhas-Baahubali-2-The-Conclusion‘జక్కన్న’ చెక్కిన ‘బాహుబలి’ అనే శిల్పం భారతీయ సినీ పరిశ్రమలో సరికొత్త చరిత్రకు వేదిక అవుతోంది. కనివినీ ఎరుగని రికార్డులను కొల్లగొడుతున్న ‘బాహుబలి : ది కన్ క్లూజన్’పై ఉన్న అంచనాలు అసాధారణం. వాటిని అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. కానీ, దర్శకుడు రాజమౌళితో పాటు చిత్ర నటీనటులు, సాంకేతిక వర్గం అంతా వాటిని విజయవంతంగా అధిగమించారు. అందుకే బాక్సాఫీస్ వద్ద “బాహుబలి 2” ప్రభంజనం ఎవరి ఊహకు అందని విధంగా ఉంది. ఈ సినిమా కలెక్షన్ల చరిత్ర గురించి పూర్తిగా తెలియాలంటే మరికొద్ది రోజుల సమయం పడుతుంది.

అయితే కాసేపు కలెక్షన్స్ పక్కన పెడితే… ‘బాహుబలి 2’ సినిమా విడుదలకు ముందు ఉన్న ఏకైక పజిల్ ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?’ అని! దానిని ఆమోదయోగ్యంగా చూపించడంలో రాజమౌళి మరోసారి తన మార్క్ సత్తా చాటుకున్నారని చెప్పవచ్చు. కానీ, ఈ సినిమా విడుదలకు ముందు యుద్ధ సన్నివేశాల గురించి దర్శకుడు రాజమౌళితో సహా అందరూ చాలా గొప్పగా చెప్పారు. దీంతో ఈ సినిమాలో ఇవే హైలైట్స్ గా నిలుస్తాయని అంతా భావించారు. కానీ, విడుదలైన తర్వాత “ఏమోషన్స్” హైలైట్స్ గా నిలిచి అంచనాలను తలక్రిందులు చేసాయి.

నిజమే… ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఈ స్థాయిలో యుద్ధ సన్నివేశాలతో కూడిన సినిమా లేదు. కానీ ఆ యుద్ధ సన్నివేశాలకు మించిన స్థాయిలో సిల్వర్ స్క్రీన్ పై అత్యద్భుతంగా ఏమోషన్స్ ను పండించడంలో రాజమౌళి ఏంటో మరోసారి సినీ ప్రపంచానికి తెలిసి వచ్చింది. ఇంకో విధంగా చెప్పాలంటే… ఇంత అమోఘంగా విజువల్ ఎఫెక్ట్స్ ను చూపించిన దర్శకుడు మరొకరు లేరు అని రాజమౌళిని ఎలా కితాబిస్తున్నారో… ఏమోషన్స్ ను కూడా ఇంత చాకచక్యంగా పండించడంలో మరొక దర్శకుడు లేడనే చెప్పాలి.

‘బాహుబలి 2’ కధంతా ఏమోషన్స్ మాత్రమే నిండుకుని ఉంటుంది. కధ, కధనం పాతవే అయినా… రాజమౌళి పండించిన విధానం… వాటిని నటీనటులు ప్రదర్శించిన విధానం… ప్రేక్షకులను సమ్మోహితులను చేస్తున్నాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ లో ‘అమరేంద్ర బాహుబలి’గా ప్రభాస్ ఎలివేషన్ సీన్ అయినా… దేవసేన కాళ్ళను శివగామి పట్టుకునే సన్నివేశం అయినా… నిండు సభలో సేనాధిపతి తలనరికే సన్నివేశం అయినా… ఇలా మూడు గంటల ఆద్యంతం మానవ ఏమోషన్స్ రాజమౌళి కట్టిపడేసాడు.

అలా అని రాజమౌళి ఎంచుకున్న ప్లాట్ కొత్తది కాదు. మనసిచ్చిన మగువ కోసం తల్లిని ఎదిరించిన సన్నివేశాలు ఎన్ని సినిమాలలో లేవు? సింపుల్ గా చెప్పాలంటే… ‘బాహుబలి 2’ కథ థీమ్ కూడా ఇదే. తన తల్లి నేర్పిన ధర్మాన్ని అనుసరించి, మనసిచ్చిన మగువ కోసం అదే తల్లిని ఎదిరించడంతో ప్రారంభమైన ‘అంతర్యుద్ధం’ చివరికి కొడుకు తీర్చుకున్న రివేంజ్ స్టోరీతో ముగుస్తుంది. చెప్తే ఇంత సింపుల్ గా ఉన్న కధను, స్క్రీన్ పై మలిచిన విధానానికే… అందరూ “సాహోరే రాజమౌళి” అంటూ ‘జై హారతి’ పడుతున్నారు. నిజమే ఇలాంటి అన్ని ప్రశంసలకు రాజమౌళి అర్హుడే..!