Prabhas Adipurush Trailerతెలుగు సినిమాలు చూసేవాళ్ళకే కాదు దేశవ్యాప్తంగా రాముడి మీద ఆయన రూపు రేఖల మీద ఒక నిర్దిష్టమైన అభిప్రాయం ఉంది. ఉదాహరణకు మన ప్రేక్షకులనే తీసుకుంటే లవకుశ కాలం నుంచే ఎన్టీఆర్ ముద్ర బలంగా పడిపోయింది. రఘురాముడిగా నిండైన దివ్యమంగళ స్వరూపంతో ఆయన తెరమీద కనిపిస్తే అభిమానులే కాదు సగటు జనాలు కూడా పరవశంతో ఊగిపోయారు. సంపూర్ణ రామాయణంలో శోభన్ బాబు ఎంత గొప్పగా నటించినా, శ్రీరామరాజ్యంలో స్వయానా నందమూరి వారసుడు బాలకృష్ణ ఆ పాత్ర పోషించినా అన్నగారి స్థాయిని దాటలేకపోయారు.

ఇక నార్త్ ఆడియన్స్ పరంగా చూసుకుంటే రాముడంటే 1990 టైంలో రామానంద్ సాగర్ సృష్టించిన రామాయణం సీరియల్ లో అరుణ్ గోవిల్ ముందు గుర్తొస్తాడు. ఈయన ప్రభావం దశాబ్దాల తరబడి అలా ముద్రించుకుపోయింది, ఇక్కడ చెప్పిన వాళ్ళందరూ రఘునందనుడిగా కనిపించే క్రమంలో మీసాలు లేకుండా నటించారు. రావణుడికి ఉంటాయి కానీ సీతాసతుడికి పెట్టే ధైర్యం ఎవరూ చేయలేకపోయారు. ఇప్పుడీ సంప్రదాయానికి ప్రభాస్ ఎదురీదుతున్నాడు. దట్టమైన మీసాలతో 5జి జనరేషన్ కు రాముడిని సరికొత్తగా పరిచయం చేయబోతున్నాడు.

ఇతిహాసగాథలు కాబట్టి రాముడైనా లక్ష్మణుడైనా ఇలాగే ఉంటారని చెప్పడానికి చేత్తో గీసిన ఛాయాచిత్రాలు తప్ప నిర్దిష్టమైన ఆధారాలు లేవు. అలాంటప్పుడు ప్రభాస్ మీసాలతో కనిపించడం తప్పేం కాదు. అయితే చాలా సవాళ్ళను ఎదురు కోవాల్సి ఉంటుంది. ఇవాళ వచ్చిన ట్రైలర్ చూస్తే మనకు తెలిసినా కథే చూపించారు. అయినా ఎందుకు తీశారు. వందల కోట్ల మార్కెట్ ఉన్న ఒక ప్యాన్ ఇండియా స్టార్ ఇమేజ్ వాడుకుని అయోధ్య ఆలయ సెంటిమెంట్ బలంగా ఉన్న సమయంలో ఈ గాథకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చి దాంతో పాటు వందల కోట్ల బిజినెస్ చేసుకోవడం.

ఒకవేళ అదిపురుష్ కనక బ్లాక్ బస్టర్ అయితే మరికొందరు ఈ దారిలో నడుస్తారు, గోపాల గోపాల లాంటి సినిమాల్లో ఆల్రెడీ కృష్ణుడిని మోడరన్ అవుట్ ఫిట్స్ లో చూపించేశారు. అన్నమయ్య టైంలో నాగార్జున వేషధారణ మీద కామెంట్లు వచ్చిన దాని సక్సెస్ ముందు నిలబడలేదు. చిరంజీవి శివుడిగా చేశాడు కాబట్టే కథ ప్రకారమే అయినా సన్నివేశాలు సృష్టించి మరీ శ్రీమంజునాథలో డాన్సులు చేయించాల్సి వచ్చింది. మరి ఇప్పుడు ప్రభాస్ 2023 రాముడిగా వీళ్లందరినీ మరిపించేలా కొత్త ఒరవడి సృష్టిస్తాడా లేదానేది జూన్ 16 తేలిపోతుంది. గురి కుదిరిందా తెరకో కొత్త రాముడు వచ్చినట్టే.