Prabhas-Adipurush-Postponementఅప్పుడెప్పుడో 1995లో నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డికి అమ్మోరు సినిమా తీయడానికి అయిదేళ్లకు పైగానే పట్టింది. ఎంచుకున్న సబ్జెక్టు అలాంటిది కావడం, గ్రాఫిక్స్ కోసం చాలా పరిమిత వనరులతో విదేశాలకు పదే పదే వెళ్లాల్సి రావడం లాంటి కారణాల వల్ల స్టార్ క్యాస్టింగ్ లేకపోయినా ఫైనల్ గా తాను కోరుకున్న అవుట్ ఫుట్ తో అద్భుత ఫలితాన్ని అందుకున్నారు. దీని వసూళ్ల జాతరకు నిజంగానే డిస్ట్రిబ్యూటర్లకు పూనకాలొచ్చాయి. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో అంజి చేసినప్పుడూ ఇదే సమస్య. సంవత్సరాలు హారతి కర్పూరంలా కరిగిపోయాయి. కోట్లకు కోట్లు అప్పు చేయాల్సి వచ్చింది. కమర్షియల్ రిజల్ట్ పక్కనపెడితే అదో విజువల్ వండర్.

సరే అప్పుడంటే టెక్నాలజీ ఇంత విస్తృత స్థాయిలో లేదు. అసలు ఇంటర్ నెట్ అంటే తెలియని టైం అది. అయినా కూడా ఈ స్థాయి అవుట్ ఫుట్ తీసుకొచ్చారు. కానీ ఇప్పుడలా కాదు. ముంబై నుంచి హైదరాబాద్ దాకా అన్ని ప్రధాన నగరాల్లో టాప్ క్లాస్ విఎఫెక్స్ కంపెనీలు వచ్చాయి. పోనీ విదేశీ నిపుణులే కావాలన్నా ఖర్చు పెట్టేందుకు రెడీ అయితే క్షణక్షణంలో సీతారామశాస్త్రి గారు చెప్పినట్టు కొండమీద కోతైనా దొర్లుకుంటూ వస్తుంది. కానీ 1995లో ఏదైతే సమస్య ఉందో 2022లోనూ అదే రిపీట్ కావడం ఆశ్చర్యపరిచే విషయం. ఆది పురుష్ టీమ్ పట్టుమని రెండ్ నిమిషాల టీజర్ తో మెప్పించలేక ఏడు నెలల వాయిదాకు సిద్ధపడటం కొత్తగా జూన్ 16 డేట్ లాక్ చేయడం ఫ్యాన్స్ కి ఆగ్రహం కలిగిస్తోంది.

క్వాలిటీ కోసం తపించడం తప్పు కాదు. కానీ స్టార్ల విలువైన సమయాన్ని కూడా గుర్తించాలిగా. మూడు పాత్రలు వేసి స్వీయ దర్శక నిర్మాణంలో ఎన్టీఆర్ తీసిన దానవీరశూరకర్ణ షూటింగ్ కు పట్టిన సమయం నలభై అయిదు రోజులు. ఇప్పటికీ అదో చరిత్రగా చెప్పుకుంటారు. దేవి, దేవిపుత్రుడు సమయంలో నిర్మాత ఎంఎస్ రాజు ఎన్ని ఇబ్బందులు ఎదురుకున్నా అనుకున్న టైంకే రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడు సౌకర్యాలు, మనుషులు, డబ్బు అన్నీ అందుబాటులో ఉన్నా చెప్పిన టైంకి రిలీజ్ చేయలేకపోవడమంటే విచిత్రమే. హాలీవుడ్ లో కెమెరా స్విచ్ ఆన్ చేసిన రోజే రిలీజ్ డేట్ లాక్ అవుతుంది. కరోనా లాంటి అనూహ్య పరిస్థితులు ఎదురైతే తప్ప ఖచ్చితంగా దాన్ని అందుకుంటారు

ఈ ధోరణి రాజమౌళి మొదలుపెట్టిందే అయినా అందరూ అదే ఫాలో అయిపోయి ఏళ్లకేళ్లు సినిమాలు తీస్తామంటే ఎలా. మరి రాధే శ్యామ్, సాహోలు ఏమయ్యాయో చూశాంగా. సరిపడా పెట్టుబడి చేతిలో ఉంటే యాభై అంతస్థుల అపార్ట్ మెంటే నెలల వ్యవధిలో కట్టేస్తున్న వేగంలో వందల కోట్లు చేతిలో పెట్టుకుని రెండు నిమిషాల టీజర్ తో కూడా జనాన్ని మెప్పించలేని పరిస్థితికి ఎవరు బాధ్యులు. ఎలా తీసినా జనం చూస్తారనే ధీమాలు పనిచేయవని బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా అందరు స్టార్లకు అర్థమవుతోంది. 1963లో వచ్చిన లవకుశకు విపరీతమైన జాప్యం జరగడంలో న్యాయముంది కానీ అరవై ఏళ్ళ తర్వాత కూడా రిపీట్ అయితే ఎవరిని బాధ్యులను చేయాలి