prabhas about music directors on radhe shyam“రాధే శ్యామ్” రిలీజ్ కు ముందు ఇచ్చిన ప్రమోషన్స్ లో సినిమాకు సంబంధించి ఓ కీలక విషయాన్ని తెలిపారు. ఇది లవ్ స్టోరీ గనుక కధకు పాటలు చాలా ప్రాధాన్యతను కలిగి ఉన్నాయని, అందుకే ఒక్కో భాషకు ఒక్కో సంగీత దర్శకుడిని ఎంపిక చేసుకున్నామని ప్రభాస్ అన్నారు.

“సాహో” విషయంలో ఇందులో పొరపాటు జరిగిందని, పాటలు తెలుగు ప్రేక్షకులకు అంతగా నచ్చలేదని అనిపించిందని, అందుకే ‘రాధే శ్యామ్’కు ఇంతమంది సంగీత దర్శకులు పని చేసారని చెప్పుకొచ్చారు. ఇక సినిమా రిలీజ్ తర్వాత తేలిందేమిటంటే… ప్రభాస్ చెప్పింది నూటికి నూరు శాతం నిజం.

ప్రేమకధకు సంగీతం చాలా ప్రాముఖ్యం. ప్రేక్షకులలో ‘లవ్’ ఫీల్ కలిగించడానికి పాటలే బాగా దోహదపడుతుంటాయి. మరి “రాధే శ్యామ్” అలాంటి అనుభూతిని ప్రేక్షకులకు పంచిందా? అంటే కాదనే చెప్పాలి. “సాహో” విషయంలో ఎలాంటి అనుభవాలు ప్రేక్షకులు చవిచూసారో, ‘రాధే శ్యామ్’కు కూడా అలాంటి అనుభూతే ఎదురయ్యింది.

‘ఈ రాతలే’ పాట మినహా సినిమాలోని ఏ పాటలు ప్రేక్షకులను అలరించ లేకపోయాయి. వెండితెరపై కనిపించిన ‘గ్రాండ్ విజువల్స్’కు పాటలు గానీ, అందులోని సాహిత్యం గానీ ఉపయోగపడలేదు. ముఖ్యంగా తెలుగు నేటివిటీ అస్సలు కనిపించలేదు. కధ మొత్తం ఇటలీలో జరిగినా, పాటలలోని సాహిత్యం తెలుగుతనం పూర్తిగా లోపించింది.

థమన్ అందించిన నేపధ్య సంగీతం బాగుంది కాబట్టి సరిపోయింది గానీ, లేదంటే ‘రాధే శ్యామ్’కు మరింత నెగటివ్ టాక్ లభించి ఉండేదేమో! ‘సాహో’ పాటలు వర్కౌట్ అవ్వలేదని ప్రభాస్ గుర్తించడం మంచి విషయమే, కానీ అవే తప్పులను మళ్ళీ ‘రాధే శ్యామ్’లో రిపీట్ చేయడం మాత్రం ఆశించిన పరిణామం కాదు.