టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కీర్తింపబడుతున్న యంగ్ రెబల్ స్టార్ పెళ్లి వార్త ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే ఎన్నో సందర్భాలలో తన పెళ్లి ప్రస్తావన రాగా, ఎప్పుడూ దాటవేస్తూ వస్తున్న యంగ్ రెబల్ స్టార్, ఈ సారి మాత్రం దానిపై పెదవి విప్పారు. అయితే ఎలాంటి పెళ్లి సంగతులు చెప్పలేదు గానీ, ‘తన పెళ్లి ఎప్పుడు జరుగుతుందో, ఎవరితో జరుగుతుందో తనకే తెలియదని’ అభిప్రాయపడ్డారు. అంటే ఇంకోసారి తనను ఈ విషయం అడగవద్దు అన్నట్లుగా మీడియా వర్గాలకు పరోక్ష సూచనలు ఇచ్చారు ప్రభాస్.

ఇక, ఈ నెల 28న విడుదల కాబోతున్న ‘బాహుబలి 2’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఇంటర్వ్యూలు ఇస్తున్న ప్రభాస్, అందులో భాగంగానే ఈ పెళ్లి కబురు తెలిపారు. సినిమా విషయానికి వస్తే, ఈ సినిమాలో తన క్యారెక్టర్ ‘బాహుబలి’ కాకుండా తనకు రమ్యకృష్ణ పోషించిన ‘శివగామి’ పాత్ర అంటే చాలా ఇష్టమని అన్నారు. ఈ పవర్ ఫుల్ రోల్ లో రమ్యకృష్ణ అద్భుతంగా నటించారని కీర్తించిన ప్రభాస్, మరో పాత్ర అయిన కట్టప్పది చాలా కీలకమైన పాత్ర అని చెప్పారు. ‘బాహుబలి’ అనేది ‘ఇండియన్ సినిమా’గా అందరూ ఫీల్ అవుతుండడం గొప్ప విషయంగా ప్రభాస్ అభిప్రాయపడ్డారు.