posani-krishna-murali-praises-chiranjeeviసినిమా ఇండస్ట్రీలో హీరోలకు ‘భజన’ చేయడం కొత్త కాదు. నాటి పరుచూరి బ్రదర్స్ నుండి నేటి డైమండ్ రత్నం వరకు అందరూ చేసేది అది. అయితే డైమండ్ రత్నం వంటి వారు ఎలాంటి మొహమాటం లేకుండా బయటకు చెప్పేస్తారు, మరికొందరు చెప్పరు, అంతే తేడా! అయితే కొన్ని వ్యక్తిత్వాలు మాత్రం ఇలాంటి ‘భజన’ సిద్ధాంతాలకు బహు దూరం. తమ్మారెడ్డి భరద్వాజ, పోసాని కృష్ణమురళీ లాంటి కొన్ని ప్రత్యేకమైన పర్సనాలిటీలకు సినీ జనాల్లో ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వీరి దగ్గర నుండి ప్రేక్షకులు కూడా భజన ప్రసంగాలను ఆశించరు. ఒకవేళ వీరిలో మార్పు వచ్చి భజన బిగిన్ చేస్తే మాత్రం అవాక్కవ్వాల్సిందే.

అలాంటి అవాక్కయ్యే స్పీచ్ లానే తాజాగా పోసాని కృష్ణమురళీ చేస్తుండడం విశేషం. అది కూడా మెగాస్టార్ చిరంజీవిని ఇటీవల ప్రశంసలతో ముంచెత్తడం గమనించదగ్గ అంశం. ఏదైనా సమయం, సందర్భం వస్తే… ఇలాంటి ఆకాశానికేత్తేసే మాటలు సర్వ సాధారణమే. కానీ, ఎలాంటి సందర్భం లేకుండా పోసాని చేస్తున్న పొగడ్తలు, దేనికి సంకేతాలు అన్న చర్చ ట్రేడ్ వర్గాల్లో జరుగుతోంది. ముఖ్యంగా చిరంజీవి ‘ప్రజారాజ్యం’ తిరిగి ప్రారంభిస్తే తానూ జాయిన్ అవుతానని చెప్పడం అనేది పోసాని నుండి ఆశించినది కాదు. ఇది ఆచరణకు సాధ్యం కాని విషయమని ఏపీలో ఏ చిన్న పిల్ల వాడిని అడిగినా చెప్తారు. మరి అంతలా అభిమానం కురిపించడం వెనుక ఉద్దేశం ఏమిటో మెగా అభిమానులకే అర్ధం కాని విషయం.

తాజాగా పోసాని మాట్లాడిన ఓ వీడియోను ‘ఖైదీ నంబర్ 150’ ప్రమోషన్ లో భాగంగా కొణిదెల ప్రొడక్షన్స్ సోషల్ మీడియాలో విడుదల చేసింది. చిరంజీవి వ్యక్తిత్వాన్ని పొగుడుతూ సాగిన ఈ వీడియోలో మెగా కుటుంబం పట్ల పోసాని ‘భజన’ కనపడడం విశేషం. చిరు సినిమా విడుదల కావడానికి ఇంకా మూడు నెలల సమయం ఉంది. ఇప్పటినుండే సినిమా ప్రమోషన్స్ అంటే అది పస లేని ప్రసంగాలుగానే మిగిలిపోతాయి. ప్రస్తుతం ‘ఖైదీ నంబర్ 150’ కోసం చిత్ర బృందం కూడా చేస్తోంది అదే.

ఇవాళ కొత్తగా చిరంజీవి వ్యక్తిత్వం గురించి పోసాని ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. సినిమాల పట్ల చిరు చిత్తశుద్ధి ఏమిటో అందరికీ తెలిసిందే. అయినా పోసాని తనంతట తానూగా చెప్పాడో లేక మెగా ఒత్తిడిల వలన చెప్పాల్సి వచ్చిందో ఏమో గానీ, మొత్తానికి పస లేని ప్రశంసలకు పోసాని కేరాఫ్ అడ్రస్ అయ్యారు. ఏదో ఆశించి ఒకరిని మెచ్చుకోవడం అనేది పోసాని వ్యక్తిత్వానికి విరుద్ధం అన్నది సినీ వర్గాల్లో చెప్పుకుంటుంటారు. మరి ఏది లేకుండా పోసాని ఎందుకు చేస్తున్నారు? కేవలం మెగా సినిమాలలో అవకాశాల కోసమేనా..?! ఏమో అసలు విషయం ఏమిటో..? మెగా గుట్టు విప్పెదేవరో..?!