Posani Krishna Murali Fires on politiciansసినీ ఇండస్ట్రీలో ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తులలో పోసాని కృష్ణమురళీ ఒకరన్న విషయం తెలిసిందే. దీంతో తను మాట్లాడే మాటలు కొందరికి కటువుగా ఉండడంతో ఎప్పుడూ సంచలనంగా నిలుస్తాయి. ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తోన్న పెద్ద నోట్ల రద్దు విషయంపై కూడా పోసాని స్పందించారు. “ఈ నిర్ణయం వలన సామాన్య ప్రజలు సమస్యలను ఎదుర్కొంటున్నారని” చెప్తూ రాజకీయ నాయకులపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.

“రాజకీయ నాయకులు బహిరంగ సభలు నిర్వహించడానికి, ఆ సభలకు జనాలను తరలించడానికి, రోడ్లు, కూడళ్ళల్లో హోర్డింగులు నిండిపోయేలా పెట్టడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే దేశం డబ్బంతా రాజకీయ నాయకులు మాత్రమే వినియోగించుకోవాలి, ప్రజలంతా తమకు అయ్యే ఖర్చంతా చెక్కుల రూపంలో చెల్లించుకోవాలి, ఆధారాలు చూపాలి, కొంత నగదును మాత్రమే అకౌంట్లో ఉంచుకోవాలి, ప్యూర్ గా, ఫెయిర్ గా ఉండాలి” అంటూ వ్యంగ్యంగా రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేసారు.

“సామాన్యులకు ఒక రూల్, రాజకీయ నాయకులకు మరో రూల్ అంటే ఎలా రాజా? ఇక నుండి మీరు, మీ పార్టీ నేతలు పెట్టే ప్రతి పైసాకు కూడా లెక్కలు చూపిస్తారా రాజా?” అంటూ పోసాని వేసిన ప్రశ్నలను సమర్ధించకుండా ఉండలేం. నిజానికి ఇవి పోసానిలోనే కాదు, ప్రతి సామాన్యుడి మదిలో వ్యక్తమవుతున్న ప్రశ్నలే. అయితే వీటికి సమాధానం లభించాలన్నా, ప్రధాని ప్రకటనలో చిత్తశుద్ధి తెలియాలన్నా మరికొంత కాలం వేచిచూడక తప్పని పరిస్థితి.