Posani Krishna Muraliపవన్‌ కళ్యాణ్‌ గురించి వైసీపీలో మంత్రులందరూ ఎంత నీచంగా మాట్లాడుతుంటారో అందరూ వింటూనే ఉన్నారు. ఇంతకీ పవన్‌ కళ్యాణ్‌ చేసిన తప్పెమిటంటే టిడిపితో పొత్తులు పెట్టుకోవాలనుకోవడమే! వచ్చే ఎన్నికలలో 175 సీట్లు మేమే గెలుచుకొంటామని చెపుతున్నారు కనుక పవన్‌ కళ్యాణ్‌ ఎవరితో పొత్తులు పెట్టుకొంటే మాకెందుకు? అని వైసీపీ నేతలు అని ఉంటే హుందాగా ఉండేది. కానీ వారి పొత్తులతో తమ విజయావకాశాలు దెబ్బ తింటాయనే ఆందోళనతో ఉన్న వైసీపీ నేతలు పవన్‌ కళ్యాణ్‌ గురించి చాలా నీచంగా మాట్లాడుతున్నట్లు భావించవచ్చు. పవన్‌ కళ్యాణ్‌ గురించి ఇంత చులకనగా, నీచంగా మాట్లాడుతున్నా అన్నయ్య చిరంజీవి మాత్రం మావాడే అంటున్నారు పోసాని కృష్ణ మురళి.

ఇటీవల రజనీకాంత్‌ చంద్రబాబు నాయుడుని పొగిడినందుకు ఆయనపై దండెత్తిన వైసీపీ సేనలో పోసాని కూడా ఉన్నారు. “రజనీకాంత్‌కి పనిలేకపోతే ఏపీకి వచ్చి చంద్రబాబు నాయుడి భజన చేసుకోమనండి. మాకేమీ అభ్యంతరం లేదు. ఎందుకంటే ఆయన తమిళనాడు ప్రజలకే సూపర్ స్టార్ కానీ మాకు కాదు. మా సూపర్ స్టార్… మెగాస్టార్ చిరంజీవి మాత్రమే. ఆయనకు జగనన్న అంటే ఎంతో అభిమానం. జగనన్నకు కూడా ఆయన అంటే చాలా అభిమానం,” అని పోసాని అన్నారు.

పవన్‌ కళ్యాణ్‌, చంద్రబాబు నాయుడుతో చేతులు కలుపుతున్నందుకు వారిది ‘తోడేళ్ళ గుంపు’ అని జగన్‌ స్వయంగా అనేకమార్లు అన్నారు. “నా తమ్ముడి గురించి ఆ విదంగా మాట్లాడుతున్నవారే నా ఇంటికి వచ్చి అతిధి మర్యాదలు స్వీకరించి మమ్మల్ని శుభకార్యాలకు ఆహ్వానిస్తుంటారని,” చిరంజీవి సున్నితంగా చురకలు వేసినా వైసీపీలో ఎవరూ పట్టించుకోలేదు.

ఏదో ఓ రోజు తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌ ఏపీలో అత్యున్నత (ముఖ్యమంత్రి) పదవి అధిష్టాడని చిరంజీవి చెప్పినా పెద్దగా స్పందించలేదు. వారు స్పందించకపోయినా చిరంజీవి తన మనసులో ఉన్నది కాస్త సున్నితంగానే చెప్పేశారనుకోవచ్చు. ఒకవేళ చిరంజీవి “నేను నా తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌కే మద్దతు ఇస్తాను… వచ్చే ఎన్నికలలో తమ్ముడికి మద్దతుగా ప్రచారంలో పాల్గొంటానని,” స్పష్టంగా చెప్పేసి ఉంటే ఈపాటికి సిఎం జగన్‌తో సహా మంత్రులందరూ, చిరంజీవిపై కూడా విరుచుకుపడుతుండేవారు. కానీ ఇంకా ఆ మాట చెప్పలేదు కనుక చిరంజీవిని మావాడంటున్నారు. కానీ ఎన్నికలకు ముందు ఎలాగూ చిరంజీవి తమ్ముడికి మద్దతు తెలపడం ఖాయమే. అప్పుడు పోసానితో సహా వైసీపీలో అందరూ ఆయనని తిట్టిపోయాడమూ ఖాయమే.