Portion of historic Charminar minaret fall downతెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ లోని ప్రపంచ ప్రసిద్ధ కట్టడం చార్మినార్‌లోని ఓ మినార్‌ నుంచి పెచ్చులు ఊడి కింద పడ్డాయి. రాత్రి జరిగిన ఈ ఘటనతో పాతబస్తీ ఉలిక్కిపడింది. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానిక కార్పొరేటర్‌, చార్మినార్‌ ట్రాఫిక్‌ ఏసీపీ ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. కాలుష్యం కారుణంగా చార్మినార్ రంగు వెలిసిపోవడంతో పురావస్తు శాఖ మరమ్మత్తులు చేపట్టింది.

గత సంవత్సర కాలంగా మినార్లను శుభ్రం చేయించి రంగులు వేయిస్తోంది. పనులు పూర్తయిన మినార్‌ ఆర్చిలోని కొంతభాగం ఇప్పుడు కూలడంతో అసలు పనుల నాణ్యత మీద అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎండ వేడి వల్ల ఇలా జరిగిందా.. లేక మరేదైనా కారణమా అన్న విషయమై పురావస్తు శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా హైదరాబాద్ కే తలమానికంగా ఉన్న చార్మినార్ ను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజల అభిప్రాయం. అదీగాక ఆ ప్రాంతం నిత్యం రద్దీగా ఉండే ప్రదేశం కావున మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ‘

ఇక చరిత్ర విషయానికి వస్తే భాగ్యనగర నిర్మాత, కుతుబ్‌షాహీ సామ్రాజ్యానికి ఐదో సుల్తాన్ అయిన మహ్మద్‌ కులీ కుతుబ్‌షా క్రీ.శ. 1591లో దీన్ని నిర్మించారు. అంటే చార్మినార్ నిర్మించి సుమారు 428 సంవత్సరాలైంది. ఈ నిర్మాణానికి గల కారణాలు అనేకంగా ప్రచారంలో ఉన్నాయి. ఒకప్పుడు ప్లేగు వ్యాధి ఎక్కువగా ప్రబలింది. ఆ వ్యాధి పూర్తిగా నయమైన శుభవేళను కలకాలం గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో చార్మినార్‌ నిర్మాణం జరిగిందని కొందరు చెబితే.. కుతుబ్‌షాహీ పాలకుల విజయ వైభవానికి ప్రధాన సింహద్వారంలాగా చార్మినార్‌ నిర్మించారని ఇంకొందరు చెబుతున్నారు.