Poonam kaur sensational tweets“భీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిన పిదప మొదలైన పూనమ్ కౌర్ ట్వీట్లు, అలా కొనసాగుతూనే ఉన్నాయి. విశేషం ఏమిటంటే… ఇందులో ఏ ఒక్కరి పేర్లు ప్రస్తావించలేకపోయినా, అవి సెన్సేషన్ గా మారిపోయాయి. అందుకు కారణం పూనమ్ కౌర్ కు సంబంధించి గత ఎన్నికల ముందు హల్చల్ చేసిన సంగతులే.

“రాజకీయాలు వినోదంగా మారిపోయాయి, వినోదం అనేది రాజకీయంగా మారిపోయిందని” ప్రారంభించిన పూనమ్, ఆ తర్వాత ఓ సెన్సేషనల్ ట్వీట్ వేసి, డిలీట్ చేసేసింది. దీని వెనుక ఆంతర్యం ఏమిటో తెలియదు గానీ, డిలీట్ చేసిన ఆ స్క్రీన్ షాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ ట్వీట్ లో పరోక్షంగా పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించడమే డిలీట్ కు కారణమేమో?

“నేను మనస్ఫూర్తిగా ఆదరించి, ప్రేమించిన వ్యక్తులు ఈ రాజకీయ నాయకుల దగ్గర వాళ్లకు వాళ్ళు తక్కువ చేసుకుని, చేతులు జోడించి, చేతులు కట్టుకుంటూ ఉండడం నాకు చాలా బాధ వేస్తోంది, అవసరాలు కోసం కష్టపడి వచ్చింది వ్యక్తిత్వం చంపేసుకోవడం మానేయాలి” అంటూ హార్ట్ బ్రేకింగ్ సింబల్స్ ను వేసిన ట్వీట్ ను తక్కువ సమయంలోనే డిలీట్ చేయడంతో, సదరు స్క్రీన్ షాట్స్ షేర్ చేసుకుంటూ ఎందుకు డిలీట్ చేసారంటూ నెటిజన్లు అడుగుతున్నారు?

అలాగే పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియోను లింక్ ను షేర్ చేసుకుని తన అభిప్రాయం పంచుకున్న రాంగోపాల్ వర్మ ట్వీట్ కు కూడా సెన్సేషన్ ట్వీట్ తో బదులిచ్చింది పూనమ్. “ఒక దర్శకుడు అతని వ్యక్తిగత జీవితంపై దారుణంగా మాట్లాడి, ఓ పక్కన నిల్చుని నవ్వుతున్నాడు, అలాగే మరో దర్శకుడు రాజకీయంగా అతన్ని దిగజార్చి ట్విట్టర్ లో నవ్వుతున్నాడు, ఇద్దరూ కూడా అమ్మాయిని ఆయుధంగా పెట్టుకుని డబ్బుకు అద్దెకు తీసుకోబడిన ఏజెంట్స్” అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.

“ఎస్సీ, ఎస్టీ కాండిడేట్ ను పొలిటికల్ ఎజెండా కోసం వాడుకోవడం, వారి రాజకీయ లబ్ది కొనసాగడానికి ఒక మహిళకు నరకం చూపించేలా అసభ్యంగా తిడుతూ నగ్నంగా నిలబెట్టడం, ఓ అమ్మాయి వ్యక్తిగత జీవితం, ఆరోగ్యాన్ని నాశనం చేసి, డబ్బులను ఆఫర్ చేయడం, పోలీసులతో కంట్రోల్ చేసి భయపెట్టడం, కాల్స్ టాప్ చేయడం” అంటూ మరో ట్వీట్ చేసింది.

“ఆంధ్రప్రదేశ్ గత ఎన్నికలలో జరిగిన బిగ్గెస్ట్ క్రైమ్ ఏమిటి? మనం నిజంగా దృష్టి కేంద్రీకరించింది ఏమిటి? పెళ్లిళ్ల పైన?” అంటూ ఓ ట్వీట్ తో ప్రశ్నించగా, “నిజమేమిటో బయటకు రావాలి, సత్యమేవ జయతే” అంటూ ఇంకో ట్వీట్ తో గురువారం ఉదయాన్నే ట్విట్టర్ ప్రపంచాన్ని వేడెక్కించింది పూనమ్ కౌర్. ఈ ట్వీట్స్ మొత్తంలో ఏ ఒక్కరి పేరు చెప్పలేదు గానీ, ఒక్కో ట్వీట్ ఎవరెవరికి సంబంధించిందో అన్న విషయాన్ని అర్ధమయ్యే విధంగా ఉదహరించింది.