Ponniyin Selvan 2మల్టీస్టారర్లకు ఉండే క్రేజ్ వేరు. ఒకే జనరేషన్ లో ఉన్న పెద్ద తారలు కలిసి నటిస్తే అభిమానులకే కాదు సాధారణ ప్రేక్షకులకూ కన్నుల పండగ. ఆర్ఆర్ఆర్ విషయంలో ఫ్యాన్స్ ఎంత అతి చేసినా సరే సగటు ఆడియన్స్ కి మాత్రం అదో కన్నులపంటగా నిలిచిపోయింది. ఇప్పుడే కాదు బ్లాక్ అండ్ వైట్ కాలంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లు కలిసి పధ్నాలుగు సినిమాల్లో కలిసి చేస్తే వాటిలో అత్యధిక శాతం బ్లాక్ బస్టర్లే. ఇప్పుడు చూసినా ఏ మాత్రం విసుగురాని క్లాసిక్స్. శోభన్ బాబు, కృష్ణంరాజు, కృష్ణ అందరూ ఇలాంటివాటిలో భాగమైనవాళ్ళే

ఇప్పుడున్న సీనియర్ హీరోలు యువకులుగా ఉన్నప్పుడు ఇలాంటి కలయికలు సాధ్యం కాలేదు కానీ ఇప్పటికీ చిరు బాలయ్య నాగార్జున వెంకటేష్ లో ఏ ఇద్దరూ కాంబో అయినా చూడాలని కోరుకుంటున్న వాళ్ళు కోట్లలో ఉన్నారు. వీటి సంగతి పక్కనపెడితే మణిరత్నం విజువల్ వండర్ పొన్నియిన్ సెల్వన్ 2 కి పెద్దగా హడావిడి కనిపించడం లేదు. ఓవర్సీస్ లో హాట్ కేకుల్లా అమ్ముడుపోవాల్సిన టికెట్లు మెల్లగా తెగుతున్నాయి. తెలుగు వెర్షన్ దిల్ రాజు లాంటి బడా నిర్మాత చేయూతనందిస్తున్నా అంతగా బజ్ లేదు

అసలు పీఎస్ 1 పెద్దగా టాలీవుడ్ జనాలకు అర్థం కాలేదు. నిజానికి మణిరత్నం సెట్ చేసుకున్నది అద్భుతమైన క్యాస్టింగ్. విక్రమ్, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభిత, ప్రకాష్ రాజ్, వెంకట్ ప్రభు ఇలా కోలీవుడ్ లో ఉన్న బెస్ట్ యాక్టర్స్ అందరూ దీని కోసం చేతులు కలిపారు. మాములుగా అయితే బాహుబలి రేంజ్ లో దీని గురించి అంచనాలు రేగాలి. కానీ తమిళనాడులో తప్ప ఇతర రాష్ట్రాల్లో పట్టించుకునే దాఖలాలు పెద్దగా కనిపించడం లేదు. అంటే చోళుల చరిత్ర పట్ల మనకంత ఆసక్తి లేదనే సంగతి తేటతెల్లమవుతోంది

హంగులు హంగామాలు ఎన్ని ఉన్నా ఇంత మంది స్టార్లున్నా పొన్నియిన్ సెల్వన్ మనకు ఎక్కువ కనెక్ట్ కాలేకపోవడానికి టైటిల్ తో మొదలుపెట్టి సినిమాలో పాత్రల పేర్లను యథాతధంగా వాడటం వరకు ఎన్నో కారణాలున్నాయి. మరి తమిళంలో అంతగా ఎగబడి చూసేందుకు కారణం లేకపోలేదు. జస్ట్ ఒక చిన్న ఉదాహరణ. బొబ్బిలి యుద్ధం లాంటి పవర్ ఫుల్ సబ్జెక్టుతో మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, రవితేజ లాంటి వాళ్ళందరూ కలిసి నటిస్తే తెలుగు రాష్ట్రాల్లో ఒక్క థియేటర్లో వేరే సినిమా ఆడటం ఊహించుకోగలమా. అంత స్థాయిలో కాకపోయినా ఇలాంటి కలయిక వల్లే పీఎస్ 2కి అరవంలో బ్రహ్మరథం పడుతుంటే బయట మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు