narayana-challenges-mudragadaవైసీపీ అధినేత జగన్ కు – ఆస్తులకు విడదీయరాని బంధం అక్రమాస్తుల కేసులతో పెనవేసుకుపోయిందన్న విషయం తెలిసిందే. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ కోట్లకు పడగలెత్తాడని తేల్చిన ఈడీ ఇప్పటికే, కొన్ని వందల కోట్ల ఆస్తులను స్వాధీన పరుచుకుంది. అలాగే ‘సాక్షి’ మీడియా వంటి మరికొన్ని ‘లైన్’లో ఉన్నాయని ఇటీవల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఓ పక్కన ఆస్తులను ఈడీ ఇలా కరిగిస్తుంటే… మరో వైపు ఏపీ మంత్రి నారాయణ మాత్రం జగన్ కు 10,000 కోట్లు విలువైన ఆస్తులను ఉచితంగా రాసిస్తానని ప్రకటన చేసారు.

“అమరావతి పరిధిలో 3,169 ఎకరాలు కొనుగోలు చేశానని, సాక్షి పత్రికలో పేర్కొన్నట్టు 10 వేల కోట్ల రూపాయల విలువైన భూమి తన వద్ద ఉందని నిరూపిస్తే.., ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి గానీ, నిరూపించిన జగన్ కు గానీ, రాసిచ్చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని… ఒకవేళ అలా నిరూపించలేకపోతే వైఎస్సార్సీపీ అధినేత జగన్ తన పార్టీని, టీవీ ఛానెల్ ను, వార్తా పత్రికను మూసేస్తారా?” అంటూ సవాల్ విసిరారు నారాయణ.

ఈ ఛాలెంజ్ కు తాను సిద్ధంగా ఉన్నానని, అసెంబ్లీ సాక్షిగా తాను ప్రకటించిన ప్రకటనకు కట్టుబడి ఉంటానని, జగన్ కు చేతనైతే తన సవాలును స్వీకరించాలని సూచించారు. సాక్షి రాసిన వార్తలపై ఇప్పటికే లీగల్ నోటీసులు పంపామని, దీనికి స్పందించకపోతే 100 కోట్ల విలువైన పరువు నష్టం దావా వేస్తానని, చేతిలో పత్రిక, టీవీ ఉందని ఏది పడితే అది రాస్తుంటే చూస్తూ ఊరుకోలేమని… ఆగ్రహించారు ఈ మంత్రి వర్యులు.