ponguleti sudhakar reddy-రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విభజన హామీలపై రేపు (సోమవారం) సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. విభజన హామీలు అమలు చేయాలంటూ గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. విభజన హామీలను వెంటనే అమలు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని పొంగులేటి పిటిషన్‌‌లో పేర్కొన్నారు.

ఈ పిటిషన్‌ను రేపు సుప్రీం కోర్టు విచారించనుంది. ఇప్పటిదాకా విభజన హామీల పోరాటం పార్లమెంట్ లో జరుగుతుంటే తాజాగా ఇది సుప్రీం కోర్టుకు చేరింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కేంద్రప్రభుత్వం చిత్తశుద్ధి చూపించకపోవడంతో సుప్రీం కోర్టు ద్వారానైనా ఏమైనా కీలక ఆదేశాలు వస్తాయేమో చూడాలి.

మరోవైపు సీఎం చంద్రబాబు ఈనెల మూడు,నాలుగు తేదీలలో డిల్లీ వెళుతున్నారు. పలువురు జాతీయ నేతలను కలిసి రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని వారి దృష్టికి తెచ్చే ప్రయత్నం చెయ్యబోతున్నారు. ఇంకోవైపు లోక్ సభ వాయిదా పడిన వెంటనే వైఎస్సాఆర్ కాంగ్రెస్ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి ఢిల్లీలోని ఆంధ్రాభవన్ లో ఆమరణ నిరాహారదీక్షకు కూర్చుంటారని జగన్ ఇప్పటికే ప్రకటించారు.