Politics revolving around Prabhasరాజకీయ రంగానికి, సినీ రంగానికి అప్పుడెప్పుడో ఓ గ్యాప్ ఉండేది. ఎప్పుడైతే తెలుగు నాట ఎన్టీఆర్ చేశారో ఆ దూరం త‌గ్గిపోయింది. ఆయ‌న అడుగు జాడ‌ల్లో మ‌రికొంద‌రు సినీ ప్ర‌ముఖులు పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత అవినాభావ సంబంధం ఏర్ప‌డింది. క్ర‌మ క్ర‌మంగా ఈ బంధం బ‌ల‌ప‌డిందే కానీ.. త‌గ్గిపోలేదు. సీనియ‌ర్ స్టార్స్ రాజ‌కీయాల్లో ఉన్నారు. వార‌సులు కూడా వారి అడుగు జాడ‌ల్లోనే న‌డుస్తుంటంతో రాజకీయాలు ఇప్ప‌టికీ సినీ ఇండ‌స్ట్రీ చుట్టూ ఏదో ఒక రూపంలోనే తిరుగుతున్నాయి.

ఇటీవ‌ల సీనియ‌ర్ న‌టుడు, నిర్మాత కృష్ణంరాజు క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న బీజేపీ, ప్రజారాజ్యం.. మ‌ళ్లీ బీజేపీ పార్టీ.. ఇలా రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని కొన‌సాగించారు. చివ‌రి రోజుల్లో బీజేపీ పార్టీకి చాలా ద‌గ్గ‌ర‌గా ఉన్నారు. ఒకానొక ద‌శ‌లో బీజేపీ ప్ర‌భుత్వం ఆయ‌న్ని గ‌వ‌ర్న‌ర్‌గా కూడా నియ‌మిస్తార‌నే వార్త‌లు బ‌లంగా పుట్టుకొచ్చాయి. కానీ అలాంటిదేమీ జ‌ర‌గ‌లేదు. కృష్ణంరాజు చ‌నిపోయిన త‌ర్వాత ఆయ‌న‌పై బీజేపీ జెండాను క‌ప్పారు. ఇది చూసిన కొంద‌రు జాతీయ పార్టీ.. కేంద్రంలో అధికార పీఠంపై ఉన్న పార్టీ ఇప్పుడు కృష్ణంరాజు సినీ వార‌సుడైన ప్ర‌భాస్‌ను త‌మ‌వైపు తిప్పుకునే ప్ర‌య‌త్నాలు చేస్తుంద‌ని గుస‌గులాడుకుంటున్నారు.

నిజానికి ప్ర‌భాస్‌కి రాజ‌కీయాలు తెలియ‌వు. అంద‌రినీ క‌లుపుకుని వెళ్లే వ్య‌క్తి. ఎవ‌రినీ విమ‌ర్శించ‌డు. అంద‌రి హీరోల‌తోనూ స‌ఖ్య‌త‌గా ఉంటారు. మిగిలిన హీరోలు సైతం ప్ర‌భాస్‌ను అభిమానిస్తారు. అదీగాక ఇప్పుడు ప్ర‌భాస్ పాన్ ఇండియా హీరో. బాహుబ‌లితో ఆయన క్రేజ్ పెరిగింది. వ‌రుస పాన్ ఇండియా సినిమాల‌నే చేస్తూ త‌న ఇమేజ్ పెంచుకుంటూనే ఉన్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌భాస్‌ను బీజేపీ పార్టీ త‌మ పార్టీకి చెందిన వ్య‌క్తిగా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం బ‌లంగా చేస్తుంద‌నే ప్ర‌చారం లోలోప‌ల జ‌రుగుతుంది. ఎందుకంటే రేపు కృష్ణంరాజుకి నివాళి అర్పిస్తున్నారు. క్ష‌త్రియ సేవా స‌మితి ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న ఈ కార్య‌క్ర‌మానికి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రావ‌టం హాట్ టాపిక్‌గా మారింది.

రాజ‌నాథ్ సింగ్ హైద‌రాబాద్ చేరుకుని ప్ర‌భాస్ స‌హా కృష్ణంరాజు కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించ‌నున్నారు. అలాగే కృష్ణంరాజు సంస్మ‌ర‌ణ స‌భ‌లో పాల్గొన‌బోతున్నారు. కృష్ణంరాజు స‌భ‌కు రాజ్‌నాథ్ సింగ్ రాకూడ‌దా! అనే డౌట్ రావ‌చ్చు. రావ‌టం త‌ప్పు క‌దా.. కానీ ఈ మ‌ధ్య కాలంలో బీజేపీ అధిష్టానం అమిత్ షా, జేపీ న‌డ్డా వంటి ప్ర‌ముఖులు ఎన్టీఆర్‌, నితిన్ వంటి హీరోల‌ను క‌లిశారు ఆ స‌మ‌యంలో బీజేపీ త‌మ పార్టీ త‌ర‌పున వారిని స‌పోర్ట్ చేయ‌మ‌న‌టానికే క‌లిసిందనే ప్ర‌చారం జ‌రిగింది. ఆ వార్త‌లు బీజేపీ వ‌ర్గాలు ఖండించాయి. అయితే లోప‌ల ఏం జ‌రిగిందో క‌చ్చితంగా బ‌య‌ట‌కు పొక్క‌లేదు. దీంతో ఈ వార్త‌ల‌కు మ‌రింత ఊతం ఇచ్చిన‌ట్లు అయ్యింది. ఈ క్ర‌మంలో ఇప్పుడు రాజ్‌నాథ్ సింగ్ ఇప్పుడు కృష్ణంరాజు కోసం వ‌స్తున్నారు. ప‌నిలో ప‌నిగా ప్ర‌భాస్‌తోనూ మాట్లాడుతారు. అంటే ప్ర‌భాస్ క్రేజ్‌ను త‌దుప‌రి ఎన్నిక‌ల్లో ఉప‌యోగించుకునే దిశ‌గా రాజ‌కీయాలు న‌డుస్తున్నాయ‌ని రూమ‌ర్స్ అయితే గ‌ట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ వార్త‌ల‌పై కొన్నాళ్లు ఆగితే ప‌క్కా క్లారిటీ వ‌చ్చేస్తుంద‌న‌టంలో సందేహం లేదు.