Jr-Ntr-politicsఆనాడూ కృష్ణాజిల్లా వేదికగా వెలిసిన ‘జూనియర్ ఎన్టీఆర్ – కొడాలి నాని’ ఫ్లెక్సీలపై జూనియర్ ఎలాంటి నోరు మెదపక పోవడంతో జరిగిన డ్యామేజ్ అందరికీ తెలిసిందే. అంతేకాదు స్వయంగా బాలకృష్ణ రంగంలోకి టిడిపికి ఎదురుగా వెళితే ‘ఎవడైనా అంతే…’ అంటూ ఒక పరోక్ష వార్నింగ్ ను కూడా అదే కృష్ణాజిల్లాలో ఇచ్చి వచ్చి ఇచ్చారు. అయితే ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ప్రకటన చేసినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయి, పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది.

మళ్ళీ అదే కృష్ణాజిల్లా వేదికగా… అదే కొడాలి నాని సాక్షిగా మళ్ళీ రాజకీయ కలకలం మొదలైంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును ఏకవచనంతో సంభోదిస్తూ అత్యంత హేయకరమైన రీతిలో మాట్లాడినటువంటి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానితో కలిసి జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ ఒకే కారులో రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీనిపై ఎలాంటి సంజాయిషీ గానీ, వివరణ గానీ ఇచ్చుకున్నా టిడిపి వర్గాలు శాంతించేలా కనపడడం లేదు.

నిజానికి గత కొంత కాలం నుండి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ల తీరును పరిశీలిస్తుంటే… తెలుగుదేశం పార్టీ వర్గాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్న విశ్లేషకుల కధనాలు వెలువడుతున్నాయి. ‘నాన్నకు ప్రేమతో’ ఆడియో వేడుకపై కనీసం బాలకృష్ణ పేరును ఏ ఒక్కరూ ప్రస్తావించకపోవడం చేయడం వంటివి బహిరంగంగా తెలిసిన విషయాలు. సినీ రంగ వేడుకలపై అయితే పరిస్థితి ఇలా ఉంటే, రాజకీయాల్లో వినిపించే వార్తలు అన్ని ఇన్ని కావు. ఇటీవల అయితే ఏకంగా హరికృష్ణ వైసీపీలో చేరబోతున్నారని, అతి త్వరలోనే ముహూర్తం కుదుర్చుకున్నారని అంతర్లీనంగా అనేక వార్తలు గుప్పుమన్నాయి.

ఇవన్నీ హరికృష్ణ వేదికగా మాత్రమే జరిగాయనుకుంటే అంతకు మించిన పొరపాటు మరొకటి ఉండదని గతంలో అనేక సందర్భాల్లో స్పష్టంగా రుజువయ్యింది. ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రసంగాలు అంటే… తాత గారు, బాబాయ్ ల ‘భజన’ కార్యక్రమంలా ఉండేదన్న చలోక్తులు అనేకం వినిపించాయి. తాజాగా అదే జూనియర్ ఎన్టీఆర్ నోట నుండి ‘బాబాయ్’ అన్న పదమే కొరవడింది. అంటే నందమూరి కుటుంబానికి తానూ దూరంగా జరుగుతున్న సంకేతాలను ఇస్తున్నట్లే కదా! అలాంటి నందమూరి కుటుంబంతోనే విభేదాలు ఏర్పరిచేలా ప్రవర్తిస్తున్నపుడు, ఇక తనకున్న ‘ఎన్టీఆర్’ అన్న పేరుకు ‘సార్ధకత’ ఏముంది అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది.

అలాగే, తనపై వచ్చిన పుకార్లను సకాలంలో ఖండించకుండా, ప్రత్యర్ధి పార్టీ వర్గాలకు ఊతమిచ్చేలా ప్రవర్తించడం కూడా జూనియర్ చేసిన అతి పెద్ద తప్పిదాలలో ఒకటిగా విశ్లేషకులు పరిగణిస్తున్నారు. ఓ పక్కన టిడిపి అధినేత చంద్రబాబును కొడాలి నాని అసభ్యకర రీతిలో వ్యాఖ్యలు చేస్తుంటే… తనకు బాల్యం నుండి కొడాలి నానితో సత్సబంధాలు ఉన్నాయి, అవి అలాగే కొనసాగుతాయి… రాజకీయాలు వేరు… వ్యక్తిగత జీవితాలు వేరు అని జూనియర్ చెప్పిన తీరు… బహుశా తనకున్న తెలివితేటలను ప్రదర్శించడానికి ఉపయోగపడ్డాయేమో గానీ, ఒక పరిణితి చెందిన వ్యక్తి వ్యక్తపరచాల్సిన భావాలు కావని ఆనాడే కధనాలు వెలువడ్డాయి. తాజాగా వైసీపీ నేత రోజా చేసిన వ్యాఖ్యలు ‘జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను చంద్రబాబు ఆడనీయకుండా తొక్కేస్తున్నాడు’ అన్న సందర్భంలో కూడా జూనియర్ వర్గం నుండి పలుకే బంగారమాయేను… అన్న రీతిలో వ్యవహరించడం పరోక్షంగా జగన్ వర్గీయులను సమర్ధించడం కాదా..?

ఇవి కాక, మరొక ప్రధాన అంశం ‘మీడియా’ ప్రచారం. జూనియర్ ఎన్టీఆర్ వివాహం అయిన తర్వాత ‘స్టూడియో ఎన్’ ఛానల్ కు సంబంధించిన అన్ని వ్యవహారాలలోనూ జూనియర్ జోక్యం కల్పించుకుని, అప్పటివరకు ఉన్న సిబ్బందిని తొలగించి, తనకు అనుకూలమైన కొత్త వారిని ఏర్పాటు చేసుకోవడం దగ్గర నుండి గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యక్షంగా జగన్ పార్టీకి బేషరతు మద్దతు ప్రకటించి చేతులు కాల్చుకున్న వైనం జూనియర్ ఎన్టీఆర్ వైనానికి తలవొంపులు తెచ్చిపెట్టింది. తాత గారు స్థాపించిన పార్టీ అంటూ బహిరంగ ప్రకటనలు చేసే జూనియర్, అదే తాత గారి పార్టీని కాదని, ప్రత్యర్ధి పార్టీని భుజానకెత్తుకుని మోయడం… తాత గారిని అవమానించినట్లు కాదా..? అన్న ప్రశ్నలకు, విమర్శలకు కొదవే లేదు. ఇలాంటి అనేక సందర్భాలలో జూనియర్ తన ఆలోచనలను పరోక్షంగా బయటపెట్టి, ప్రజలలో తన మీద ‘సింపతీ’ వచ్చేలా ప్రవర్తించారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

చూడబోతుంటే ‘జూనియర్’ ఆలోచనలు కూడా ‘జగన్’ బాటలో ‘అపరిపక్వత’కు నిదర్శనంగా నిలుస్తున్నాయని, అది అతని సినీ కెరీర్ కు కూడా ప్రమాదం అన్న హెచ్చరికలు వస్తున్నాయి. జూనియర్ నటించిన గత సినిమాలను, ఇప్పటి సినిమాలను పోల్చి చూస్తే… వ్యత్యాసం ఇట్టే కనపడుతుంది. రికార్డు స్థాయి ఓపెనింగ్స్ లేవు, యావరేజ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిలబడిన దాఖలాలు లేవు. రాజకీయాల వైపుకు జూనియర్ ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం ప్రధాన కారణమని విశ్లేషకుల అభిప్రాయం.

pratyusha death mistery