Chandrababu Road Showసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో టిడిపి, జనసేన నేతలు సభలు, పాదయాత్రలు, రోడ్ షోలు నిర్వహించుకొనీయకుండా అడ్డుకోవడానికి రకరకాల ఎత్తులు వేస్తోంది. మొదట వైసీపీ కార్యకర్తలతోనే అడ్డుకొనేందుకు ప్రయత్నించింది. అయితే దాని వలన వైసీపీకి చెడ్డపేరు, సమస్యలే వస్తాయని గ్రహించి జీవో నంబర్:1 తీసుకువచ్చింది. దాంతో ప్రతిపక్ష నేతలని అడ్డుకొనేందుకు ప్రయత్నించినప్పుడు హైకోర్టు మొట్టికాయలు వేయడంతో కాస్త వెనక్కి తగ్గింది. కానీ పోలీసులతో అడుగడుగునా అవరోధాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తూనే ఉంది.

తాజాగా మరో కొత్త ఎత్తు వేసిన్నట్లు కనిపిస్తోంది. పాదయాత్ర లేదా సభలు నిర్వహించుకోవడానికి ముందు అనుమతించి, చివరి నిమిషంలో అనుమతి రద్దు చేశామని, వేరే చోట నిర్వహించుకోవాలని పోలీసులు చెప్పడం చూస్తే ఇది మరో కొత్త ఎత్తు అని అర్దమవుతూనే ఉంది.

ఈరోజు నారా లోకేష్‌ శ్రీకాళహస్తీ పట్టణంలో చతుర్మాడ వీధుల గుండా పాదయాత్ర చేసేందుకు పోలీసులు అనుమతించారు. కానీ అక్కడికి చేరుకొనే సరికి అనుమతి లేదని వేరే మార్గంలో పాదయాత్ర చేసుకోవాలని సూచిస్తున్నారు. అదేవిదంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మూడు రోజుల తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా నేడు అనపర్తి పట్టణంలోని దేవీచౌక్ సెంటర్‌లో రోడ్ షో నిర్వహించుకొనేందుకు పోలీసులు అనుమతించారు. కానీ మరికొద్ది సేపటిలో చంద్రబాబు నాయుడు అక్కడికి చేరుకోబోతుంటే అక్కడ సభలకి రోడ్ షోలకి అనుమతించలేమని మరెక్కడైనా స్థలం తీసుకొని బహిరంగసభలో నిర్వహించుకోవాలని చెప్పడంతో టిడిపి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పోలీసుల నుంచి నోటీస్ అందుకొన్న మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప తదితర టిడిపి నేతలు పోలీసులని గట్టిగా నిలదీస్తున్నారు. అన్ని ఏర్పాట్లు చేసుకొన్న తర్వాత చివరి నిమిషంలో సభకి అనుమతిలేదని వేరే చోట నిర్వహించుకోవాలని చెపితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికిప్పుడు వేరేచోట ఏర్పాట్లు చేసుకోలేమని కనుక దేవీచౌక్ సెంటర్‌లోనే చంద్రబాబు నాయుడు రోడ్ షో నిర్వహించుకొనేందుకు అనుమతించాలని, ఒకవేళ అనుమతించకపోయినా అక్కడే నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

కానీ ఎట్టి పరిస్థితులలో అక్కడ సభ, రోడ్ షోని అనుమతించబోమని చెపుతూ భారీగా పోలీసులని మోహరించి ఎక్కడికక్కడ బ్యారికేడ్స్ ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం అనపర్తిలో తీవ్ర ఉద్రిక్తవాతావరణం నెలకొని ఉంది. మరికొద్ది సేపటిలో చంద్రబాబు నాయుడు అక్కడికి చేరుకోబోతున్నారు. కనుక అనపర్తిలో ఏ నిమిషంలో ఏం జరుగుతుందో తెలీని పరిస్థితులు నెలకొన్నాయి.