Chandrababu Naidu Kuppam Tourటిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో నేడు పర్యటించినప్పుడు పోలీసులు అడ్డుకోవడంతో రణరంగంగా మారింది. తీవ్ర ఉద్రిక్తతల నడుమే చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగించారు. పోలీసులు అనుమతించనప్పటికీ భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చి చంద్రబాబు నాయుడుకి జేజేలు పలుకుతూ గజమాలతో స్వాగతం పలికి ఆయన వెంట కదిలారు.

దాంతో పలమనేరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి సుమారు 300 మంది పోలీసులను వెంటబెట్టుకొని నేరుగా చంద్రబాబు నాయుడు వద్దకే వచ్చి మీ పర్యటనకి అనుమతి లేదంటూ వాహనాన్ని అడ్డుకొని నోటీస్ ఇవ్వబోయారు. అప్పుడు చంద్రబాబు నాయుడు కూడా చాలా తీవ్రంగానే స్పందిస్తూ, “కుప్పం ఎమ్మెల్యేనైన నేను నా నియోజకవర్గంలో ఎందుకు పర్యటించకూడదో లిఖితపూర్వకంగా జవాబు ఇవ్వాలని” డిమాండ్‌ చేశారు. చంద్రబాబు నాయుడు వాహనం దిగి పాదయాత్రకి సిద్దం అవడంతో డీఎస్పీ వెళ్ళిపోయారు.

ప్రభుత్వం ఇచ్చిన తాజా జీవో ప్రకారం ఆయన పర్యటనకి అనుమతి నిరాకరించడానికి పోలీసులకు అధికారం ఉంది. కనుక ఆయన పర్యటనని అడ్డుకొనే ప్రయత్నం చేశారు. అందుకు వారిని తప్పు పట్టలేము. ఎందుకంటే వారు ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకోవలసి ఉంటుంది.

అయితే చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ప్రదాన ప్రతిపక్ష నేత. కనుక రాజ్యాంగం ప్రకారం ఆయన రాజకీయ కార్యక్రమాలను అడ్డుకోవడానికి వీల్లేదు. అదే చంద్రబాబు నాయుడు చెప్పారు. పోలీసులు రేపు ఆయన మీద కేసు నమోదు చేసినా కోర్టులో కూడా ఇదే చెపుతారు. అప్పుడు ఓ ప్రతిపక్ష నేత రాజకీయ పర్యటనలను అడ్డుకొనేందుకు ప్రభుత్వం జీవో జారీ చేయవచ్చో లేదో న్యాయస్థానమే తేల్చి చెపుతుంది. ఒకవేళ న్యాయస్థానం జీవోపై స్టే విదించినా, కొన్ని ఆంక్షలతో చంద్రబాబు నాయుడు పర్యటనకి అనుమతించినా పోయేది ప్రభుత్వం పరువే తప్ప చంద్రబాబు నాయుడు పరువు కాదు. కనుక ప్రభుత్వమే ఈ జీవోపై పునరాలోచన చేయడం మంచిదేమో?