Police responsible for protecting Amaravati farmers padayatra: High Courtరాజధాని రైతుల పాదయాత్రపై రాజమండ్రిలో వైసీపీ కార్యకర్తలు రాళ్ళు, కుర్చీలు విసిరి దాడిచేయడంతో, తమకు రక్షణ కల్పించాలంటూ రైతులు హైకోర్టులో ఓ పిటిషన్‌ వేశారు. దానిపై ఈరోజు హైకోర్టు విచారణ చేపట్టినప్పుడు రైతుల తరపు న్యాయవాది మురళీధర్ రాజమండ్రిలో జరిగిన దాడి గురించి న్యాయస్థానానికి వివరించారు. వైసీపీ ఎమ్మెల్యే మార్గాని భరత్ పర్యవేక్షణలో ఈ దాడులు జరిగాయని ఫిర్యాదు చేశారు. మళ్ళీ ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా రైతుల పాదయాత్రకు పటిష్టమైన భధ్రత కల్పించాల్సిందిగా కోర్టుని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం తరపు వాదించిన న్యాయవాది పాదయాత్ర చేస్తున్న రైతులే వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తూ రెచ్చగొట్టారని వాదించారు. న్యాయస్థానం కేవలం 600 మంది రైతులకు మాత్రమే పాదయాత్ర చేసేందుకు అనుమతిస్తే, వందలాదిమంది వారితో కలుస్తున్నారని తెలిపారు.

ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు కేవలం తాము అనుమతించిన 600 మంది రైతులు, వాహనాలు మాత్రమే పాదయాత్రలో పాల్గొనాలని, స్థానికులు ఎవరైనా వారికి మద్దతు ఇవ్వదలిస్తే రోడ్డుకి ఇరువైపులా నిలుచొని సంఘీభావం తెలుపవచ్చని హైకోర్టు సూచించింది. పాదయాత్ర చేస్తునా రైతులపై ఎవరూ దాడులు చేయకుండా తగిన ఏర్పాట్లు చేయవలసిన బాధ్యత పోలీసులదే అని హైకోర్టు స్పష్టం చేసింది. రైతుల పాదయాత్రను వ్యతిరేకిస్తున్న నిరసనకారులను వారికి దూరంగా ఉంచాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.