High Court of Andhra Pradeshగతంలో ఏ రాష్ట్ర డీజీపీకి జరగని పరాభవం ఏపీ డీజీపీకి ఆంధ్రప్రదేశ్ హై కోర్టులో జరిగింది. ఒక ప్రముఖ టీవీ ఛానల్ లో వచ్చిన కథనం ప్రకారం.. రాష్ట్రంలోని పోలీస్ వ్యవస్థపై హైకోర్టు సీరియస్ అయ్యింది. ఏపీలో పోలీస్ వ్యవస్ద గాడితప్పుతుందని న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో ‘రూల్ ఆప్ లా’ అమలు కావడం లేదని కోర్టు మండిపడింది.

వెంకటరాజు అదృశ్యంపై హైకోర్టులో హెబియస్ కార్పస్ విచారణ జరిగింది. వెంకటరాజు విషయంలో పోలీసుల తీరును హైకోర్టు తప్పుబట్టింది. గతంలో ఇటువంటి మూడు కేసులలో జుడిషియల్ విచారణ చేస్తే పోలీసులదే తప్పని తేలిందని..ప్రతిసారీ సదరు వ్యక్తి పోలీసు కస్టడీలోనే ఉండటం ఆ తరువాత హెబియస్ కార్పస్ వెయ్యగానే విడుదల చెయ్యడం జరిగిందని కోర్టు చెప్పింది.

ప్రతిసారి ఇలాంటి పరిస్థితే వస్తే ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుందని ధర్మాసనం హెచ్చరించింది. అలాగే ప్రతి కేసులో సీబీఐ విచారణ సాధ్యం కాదని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. గతంలో డీజీపీని పలుసార్లు కోర్టుకు పిలిపించినా మార్పు రాలేదని కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

అంతేకాదు.. పోలీసు వ్యవస్థను కంట్రోల్ చేయలేకపోతే డీజీపీ రాజీనామా చేయాలని హైకోర్టు వ్యాఖ్యానించడం విశేషం. ఇప్పటివరకూ ప్రభుత్వానికి హైకోర్టు అనేక మొట్టికాయలు వేసింది. అయితే అది రాజకీయపరమైన విషయంగానే చూపించుకుంటూ వచ్చింది ప్రభుత్వం. అయితే పోలీసు వ్యవస్థకు అటువంటి అవకాశం ఉండదు. మీడియా ముందుకు వచ్చి తమకు అనుకూలంగా మార్చుకుని మాట్లాడటానికి కుదరదు. ఈ తరుణంలో పోలీసు వ్యవస్థ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది.