Police constable Prakash deekshaఎక్కడైనా బాధితులు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తుంటారు కానీ పోలీసులే బాధితులైతే వారు ఎవరిని ఆశ్రయించాలి? ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పోలీసులు కూడా బాధితులే! కానీ వారు పోలీసులు కనుక క్రమశిక్షణకు లోబడి ఉంటూ తమ సమస్యలను మౌనంగా భరిస్తూ ఉండాల్సిందే. లేకుంటే క్రమశిక్షణ చర్యలు తప్పవు. ఈ విషయం తెలిసి కూడా అనంతపురంలో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ప్రకాష్ మంగళవారం నిరసన దీక్ష చేశారు. పోలీస్ కార్యాలయ ఆవరణలోనే ఉన్న అమరవీరుల స్తూపం వద్ద ప్లకార్డు పట్టుకొని దీక్ష చేశారు. ప్లకార్డులో “సిఎం జగన్ సార్.. సేవ్ ఏపీ పోలీస్, గ్రాంట్ ఎస్ఎలెఎస్, ఎఎస్ఎల్ఎస్ అరియర్స్… సామాజిక న్యాయం ప్లీజ్,” అని వ్రాశారు.

ఈ సందర్భంగా ప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ, “గత 14 నెలలుగా రవాణా భత్యం, ఆరు డీఏలు ప్రభుత్వం చెల్లించవలసి ఉంది. అలాగే మూడు సరండర్ లీవ్స్, అదనపు సరండర్ లీవుల బకాయిలు ప్రభుత్వం ఇంతవరకు చెల్లించలేదు. కానీ బకాయిలు చెల్లించినట్లు ఆడిట్‌లో చూపించి వాటిపై పన్ను కూడా వసూలు చేసింది. ఇది నా ఒక్కడి సమస్యే కాదు. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులందరూ ఇబ్బంది పడుతున్నారు. కనుక సిఎం జగన్మోహన్ రెడ్డిగారు మా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాను,” అని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌ పోలీసులకు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. అయితే పోలీస్ శాఖలో క్రమశిక్షణ చర్యలకు భయపడి అందరూ మౌనంగా పనిచేసుకుపోతున్నారు. ఇప్పుడైనా కానిస్టేబుల్ ప్రకాష్ ధైర్యం చేసి నిరసన తెలిపారు కనుక ఈ విషయం బయటకు వచ్చింది లేకుంటే ఎవరికీ తెలిసి ఉండేదే కాదు కదా?