Police cases on people who questioned in Gadapa Gadapa programసిఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం ద్వారా వైసీపీని ప్రజలకు మరింత చేరువచేయాలని ఆశిస్తే, అందుకు భిన్నంగా జరుగుతోంది. చాలా మంది ప్రజాప్రతినిధులలో సహజంగా ఉండే అధికార దర్పం, అహంభావం, నోటిదురుసుతనం వైసీపీ నేతలలో కూడా ఉండటం సహజం. అదే ఈ కార్యక్రమానికి పెద్ద అవరోదంగా మారుతోంది. ప్రజల ఓట్లతో గెలిచి వారిని గౌరవించడం తెలీని నేతలు, ప్రజలు తమని ప్రశ్నిస్తుంటే వారి అహం దెబ్బతిని ఆగ్రహంతో ప్రజలపై చిందులు వేస్తున్నారు. ప్రజలు నిలదీస్తుంటే సహనం కోల్పోయి వారితో వాగ్వాదాలకు దిగుతున్నారు.

మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ శనివారం విజయవాడలో గడప గడపకు కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆయనకు ఓ చేదు అనుభవం ఎదురైంది. నగరంలో 50వ వార్డులో నాగరాజు అనే ఓ యువకుడు చెత్తపన్ను భరించలేకపోతున్నామని చెప్పుకొంటూ, “మీరు 1,500 కోట్లు అవినీతికి పాల్పడ్డారని ప్రతిపక్షాలు చెపుతున్నాయి…” అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు. దాంతో వెల్లంపల్లి షాక్ అయ్యారు.

వెంటనే తేరుకొని “నోర్ముయ్… నీకేమి కావాలో చెప్పు… తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పింది నాకు చెప్పమాకు. పక్కనే ఉన్న ఎస్సైని పిలిచి “వీడు నేను 1,500 కోట్లు అవినీతి చేశానని చెపుతున్నాడు. వెంటనే వీడిని స్టేషన్ తీసుకువెళ్ళండి. నేను అవినీతి చేసినట్లు సాక్ష్యాధారాలు చూపించమనండి లేకపోతే వీడిపై కేసు పెట్టి లోపలేయండి,” అని ఆదేశించారు.

అప్పుడు ఆ యువకుడు మళ్ళీ ఏదో చెప్పబోతుంటే, “ఏయ్…ఆగు… నోర్మూయ్… ఎక్కువ మాట్లాడకు…ఏమనుకొంటున్నావో…” అంటూ ఆ యువకుడిని గదమాయించి నోరు మూయించారు. మళ్ళీ మరోసారి ఎస్సైకి “ఈ కుర్రాడిని ఇప్పుడే తీసుకువెళ్లి అవినీతి ఆరోపణలు నిరూపించకపోతే కేసు పెట్టి లోపలేయండి..”అంటూ మరోసారి ఆదేశించి ఆగ్రహంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు.

యువకుడిపై మంత్రి ఆగ్రహంతో చిందులు వేస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అసలు ప్రజాప్రతిధుల పట్ల ఎప్పుడూ భయభక్తులతో, వినయంగా ఉండే సామాన్య ప్రజలు కూడా ఇప్పుడు వారిని నిలదీసి ప్రశ్నిస్తున్నారంటే అర్ధం ఏమిటి? పరిస్థితి మారిందని వైసీపీ నేతలు గుర్తించలేకపోతున్నారా? అనే సందేహం కలుగుతుంది.

గడప గడపకు కార్యక్రమం ద్వారా సిఎం జగన్మోహన్ రెడ్డి ఏమి ఆశిస్తున్నారు…కానీ ఏమి జరుగుతోంది?అని ఓసారి వైసీపీ నేతలు ఆలోచించుకొంటే మంచిదేమో? లేకుంటే ప్రజాప్రతినిధుల దురుసు ప్రవర్తనతో ఈ కార్యక్రమం పూర్తయ్యేసరికి చాలా మంది ప్రజలు వైసీపీకి దూరం అయ్యే ప్రమాదం కనిపిస్తోంది.