Cases_Nara_Lokesh_Padayatra_Yuva_Galamటిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర ప్రారంభించి నేటికీ రెండు వారాలు. ఈ రెండు వారాలలో పోలీసులు నారా లోకేష్‌పై 5 కేసులు నమోదు చేశారు. వాటిలో ఒకటి క్రిమినల్ కేసు కూడా ఉంది. ఈ లెక్కన 400 రోజుల పాదయాత్ర పూర్తయ్యేలోగా పోలీసులు ఇంకెన్ని కేసులు నమోదు చేస్తారో?

నారా లోకేష్‌ ఈరోజు చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు మండలంలోని ఆత్మకూరు నుంచి పాదయాత్ర చేస్తూ సంసిరెడ్డిపల్లెకి చేరుకొన్నారు. అక్కడ గ్రామీణులు ఆయనకి హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. నారా లోకేష్‌ వారిని ఉద్దేశ్యించి మాట్లాడబోతుంటే పోలీసులు అడ్డుకొన్నారు. నారా లోకేష్‌కి మైక్ అందించబోతున్న బాషా అనే కార్యకర్త చేతిలో నుంచి పోలీసులు బలవంతంగా మైక్ లాకొనే ప్రయత్నం చేశారు. టిడిపి కార్యకర్తలు పోలీసులని అడ్డుకొని వాగ్వాదానికి దిగారు. నారా లోకేష్‌ గ్రామస్తులు ఇచ్చిన ఓ స్టూల్ మీద ఎక్కి నిలబడి, “మీరు ఏ రాజ్యాంగం ప్రకారం నన్ను అడ్డుకొంటున్నారు?మీరు ఏ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నారు? అంటూ భారత రాజ్యాంగ పుస్తకాన్ని చేత పట్టుకొని ఈ రాజ్యాంగాన్నా లేక రాజారెడ్డి రాజ్యాంగాన్నా? అంటూ ప్రశ్నించారు.

అందరికీ రాజ్యాంగ పుస్తకాన్ని చూపిస్తూ దీని ప్రకారం మాట్లాడే హక్కు నాకు ఉంది. ఎస్పీ, డీఎస్పీ ఎవరు వచ్చి అడ్డుకొన్నా పవిత్రమైన ఈ భారత రాజ్యాంగం ప్రకారం నేను నా హక్కుని కాపాడుకొంటాను. మీరు కూడా ఈ రాజ్యాంగానికి లోబడి పనిచేస్తే బాగుంటుంది,” అని నారా లోకేష్‌ విస్పష్టంగా తన హక్కులని, పోలీసుల బాధ్యతలని గుర్తు చేశారు.

ఆ తర్వాత ప్రజలని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “నా పాదయాత్రకి ఎటువంటి అవరోధాలు కల్పించమని చెపుతుంటారు. కానీ అడుగడుగునా ఇలాగే అడ్డుతగులుతున్నారు. పాదయాత్రకి అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకోమంటారు. దరఖాస్తు చేసుకొంటే ఇక్కడ సభ పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వము అక్కడ కాలేజీ మైదానంలో పెట్టుకోమంటారు. పోనీ అక్కడైనా సభ పెట్టుకొందామంటే మళ్ళీ ఇక్కడా కుదరదు వేరే చోట పెట్టుకోమంటారు. ఇక్కడా వద్దు… అక్కడా వద్దు… అంటే మరెక్కడ సభ పెట్టుకోవాలి? తాడేపల్లి ప్యాలస్‌లో పెట్టుకొమంటావా జగన్‌ రెడ్డీ? అది ప్రైవేట్ ప్రాపర్టీయే కదా? అక్కడైతే పోలీసులకి అభ్యంతరం ఉండదేమో? అయినా నా పాదయాత్రని చూసి మీ వైసీపీ ప్రభుత్వం ఎందుకు ఇంత భయపడుతోంది జగన్‌ రెడ్డీ?” అని నారా లోకేష్‌ ప్రశ్నించారు.

నారా లోకేష్‌ చేతిలో నుంచి మైక్, ఆయనని కిందకి దింపి స్టూల్ లాక్కొనేందుకు పోలీసులు ప్రయత్నించారు. కానీ గ్రామస్తులు కూడా “నారా లోకేష్‌ మాతో మాట్లాడితే మీకెందుకు అభ్యంతరం?” అంటూ నిలదీయడంతో వెనక్కి తగ్గక తప్పలేదు.