CM-Jagan's-Shocking-PM-About-Coronavirus-and-Local-Electionsఆంధ్రప్రదేశ్ లోని జగన్ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం వివాదాస్పదం అయ్యింది. వైఎస్ఆర్ మరణం తర్వాత ఏపీలో రిలయన్స్ సంస్థలపై దాడులకు సంబంధించిన కేసులు, అలాగే తునిలో కాపు ఉద్యమ సందర్భంగా రత్నాచల్ ఎక్సప్రెస్ ని తగలబెట్టిన కేసులు, ఇతర జిల్లాలలో కాపు ఉద్యమానికి సంబంధించిన కేసులను ప్రభుత్వం విరమించుకుంది.

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఉమ్మడి ఏపీలో జరిగిన ఘటనలకు సంబంధించిన కేసుల్ని ఎత్తి వేసింది. వైఎస్ఆర్ మరణం తర్వాత ఏపీలో రిలయన్స్ సంస్థలపై వైఎస్ అభిమానులు దాడులు చేశారు. పెద్ద ఎత్తున ఆస్తినష్టం సంభవించింది. అనంతపురం, గుంటూరు జిల్లాలో ఈ మేరకు కేసులు నమోదు అయ్యాయి.

ఇదే సమయంలో… కాపులకు రిజర్వేషన్లు కల్పించాలంటూ 2016 లో జరిగిన ఉద్యమం సందర్భంగా నమోదైన అన్ని కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తేసింది. తుని గ్రామీణ,పట్టణ,తుని ప్రభుత్వ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన 51 కేసులను ప్రభుత్వం ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.

ప్రభుత్వ ఆస్తుల దహనం, విధ్వంసం, మారణాయుధాలతో అల్లర్లు చేయడం, ప్రభుత్వోద్యోగులపై దాడిలాంటి అభియోగాలతో నమోదైన పలు కేసులను ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. తెలుగుదేశం నాయకులు అయితే ఈ ఘటనలు అన్నీ చేయించింది వైఎస్సార్ కాంగ్రెస్ అని, తమ వారిని కేసుల నుండి తప్పించుకోవడం కోసమే ఇప్పుడు కేసులు విరమించుకున్నారని విమర్శిస్తున్నారు.