Police case on Anchor Ravi and chalapathi rao“రారండోయ్ వేడుక చూద్దాం” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చలపతిరావు చేసిన వ్యాఖ్యల మంటలు చల్లారిపోయాయి అనుకున్న తరుణంలో… కేసుల నమోదు పర్వం కొనసాగుతూనే ఉంది. అయితే ఈ సారి సదరు వ్యాఖ్యలు చేసిన చలపతిరావు పైన కాకుండా, స్టేజ్ పై ఉండి ‘సూపర్’ అన్న యాంకర్ రవిపై కేసు నమోదు చేసారు. మహిళల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యానించారంటూ బండ్లగూడకు చెందిన మహిళా సంఘం నేత దెయ్యాల కల్పనా కుమారి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు.

దీంతో ఐపీసీ 354ఏ (IV), 509 సెక్షన్ల క్రింద యాంకర్ రవిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ వివాదంపై ఇటీవల పలు మీడియాల వేదికగా యాంకర్ తన భావాలను వ్యక్తపరిచిన విషయం తెలిసిందే. తను ‘సూపర్’ అన్న మాట నిజమే గానీ, చలపతిరావు గారు చేసిన ఆ వ్యాఖ్యలు తనకు వినపడలేదంటూ తొలుత వివరణ ఇచ్చుకున్నాడు. అయితే రవి ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత మహిళలలో ఆగ్రహం మరింత పెచ్చుమీరిన నేపధ్యంలో, ఇటీవల పాల్గొన్న ఓ మీడియా ఛానల్ సందర్భంగా తన గొడును వెలిబుచ్చుకున్నాడు.

ఆ వ్యాఖ్యలు నిజంగా తనకు వినిపించలేదని, ఒకవేళ మీరు అనుకున్నట్లు వినిపించిందని భావించినా, ఒక యాంకర్ గా తాను చేయగలిగింది ఏమీ లేదని, 50 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్న ఆ వ్యక్తిని తానేమీ అనే అవకాశం ఉండదని, అర్ధంతరంగా వెళ్ళిపోయే అవకాశం కూడా తనకు ఉండదని, వేడుకను కొనసాగించడం తప్ప నా లాంటి ఒక సాధారణ యాంకర్ ఆ పరిస్థితులలో ఏమీ చేయలేడని, ఒకవేళ మీరు చెప్పినట్లు నేను ఏదైనా చేస్తే, తర్వాత నా కెరీర్ ఏమైపోతుందో కూడా ఎవరికి తెలియని పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని తన ఆవేదనను వ్యక్తపరిచాడు.

నిజానికి రవి చేసిన వ్యాఖ్యలలోనూ అర్ధముంది. చలపతిరావు లాంటి ఒక సీనియర్ ఆర్టిస్ట్ ను రవి ఏం అనగలడు? ఓ పక్కన లైవ్… మరో పక్కన నాగార్జున వంటి పెద్ద స్టార్… ఆ పరిస్థితులలో నిజంగా రవి విన్నా, కార్యక్రమాన్ని కొనసాగించడం తప్ప ఏం చేయలేడు. అయితే ‘సూపర్’ అంటూ అభివర్ణించడం మాత్రం తప్పే. అక్కడ వినోదాన్ని పండించాలనే క్రమంలో తనకు వినపడకపోవడంతో ‘సూపర్’ అన్నానని రవి పలు సార్లు వివరణ ఇచ్చుకున్నప్పటికీ, కేసులు నమోదు కావడం విశేషం. మరి ఈ ఉదంతం చివరికి ఎక్కడికి వెళ్తుందో చూడాలి.