Polavaram will not be completed no question of giving special statusముంజేతి కంకణం చూసుకొనేందుకు అద్దం ఎందుకన్నట్లు ఏపీలో పరిస్థితుల గురించి కేంద్రాన్ని అడగడం బుద్ధి తక్కువే. పోలవరం కధేమిటో కేంద్ర ప్రభుత్వం కంటే వైసీపీ ప్రభుత్వానికే బాగా తెలుసు. అయినా వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌, టిడిపి ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌ రాజ్యసభలో పోలవరం ఎప్పుడు పూర్తవుతుంది?అని అడిగారు.

ఒకవేళ వారిద్దరికీ తెలియకపోతే, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుని అడిగితే ముందుగా తనకు తెలిసిన ‘రాజుగారు ఏడు చేపల కధ’ చెప్పి తర్వాత ఆనాడు చంద్రబాబు నాయుడు చేసిన తప్పుల వలన పోలవరం ఎప్పటికీ కట్టలేమని చెప్పి ఉండేవారు. కానీ ముందుగా అంబటిని సంప్రదించకుండా రాజ్యసభలో మైకు దొరికింది కదాని అడిగేశారు.

కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ టిడు కూడా కుండబద్దలు కొట్టినట్లు అది ఇప్పట్లో పూర్తవదని, ఇక పూర్తయ్యే అవకాశాలు కూడా లేవని మైకులో చెప్పడమే కాకుండా లిఖితపూర్వకంగా కూడా తెలియజేశారు. 2019 నుంచి కేంద్ర ప్రభుత్వం రూ.6,461.88 కోట్లు పోలవరం ప్రాజెక్టు కోసం ఇచ్చిందని చెప్పారు. ఇది గాక ఇరిగేషన్ కాంపొనెంట్ కింద కేంద్ర ప్రభుత్వం రూ.15,667.90 కోట్లు చెల్లించాల్సి ఉండగా ఇప్పటికే రూ.13,226.04 కోట్లు చెల్లించేసిందని, ఇంకా కేవలం రూ. 2,441.86 కోట్లు ఇస్తే బాకీ తీరిపోతుందని లిఖితపూర్వకంగా చెప్పేశారు.

రాష్ట్రంలో ప్రతిపక్షాల సవతి పోరు భరించలేక వైసీపీ ఎంపీలు నిద్రలో కలవరించినట్లు అప్పుడప్పుడు ప్రత్యేకహోదా… ప్రత్యేకహోదా అని కలవరిస్తుంటారు. కనుక ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభలో “ప్రత్యేక హోదా ఎప్పుడిస్తారు?” అని మళ్ళీ అడిగారు. ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్, మైకులోను చెప్పారు. లిఖితపూర్వకంగా కూడా సమాధానం చెప్పారు! ఆ రెండు సమాధానాలని ఏపీ ప్రజలు ఫోటో ఫ్రేమ్ కట్టించుకొని భద్రపరుచుకోవలసినవే!

ఇప్పుడు మళ్ళీ క్లుప్తంగా అన్నీ చెప్పుకొంటే వైసీపీ ప్రభుత్వం అమరావతి కట్టదు. మూడు రాజధానులు ఏర్పాటు చేయదు. పోలవరం పూర్తవదు. ప్రత్యేకహోదా రాదు. రైల్వే జోన్ రాదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఒకటో తారీకు జీతాలు కష్టం. పెన్షన్లు ఇంకా కష్టం. విద్యుత్‌ ఛార్జీలు గుట్టుగా పెరుగుతూనే ఉంటాయి. కాంట్రాక్టర్లకు బిల్లులు ఎప్పుడూ పెండింగ్. గుంతలు పడిన రోడ్లు ఏపీకి ఆనవాలు. అభివృద్ధి శూన్యం అయినా ఏటా లక్షల కోట్లు అప్పులు కొండల్లా పెరిగిపోతూనే ఉంటాయి. క్లుప్తంగా ఇదీ ఏపీ పరిస్థితి!

అయినా మాకే 175 సీట్లు అని వైసీపీ, ‘ఆ తర్వాత మేమే…’ అని బిజెపి నమ్మకంగా చెపుకొంటాయి. అసలు ఈ దుస్థితిలో ఏపీని నిలబెట్టినప్పటికీ మాకే ఓట్లు వేయాలని వైసీపీ, బిజెపిలు ధైర్యంగా అడగగలుగుతున్నాయంటే ఏపీ ప్రజలు వెర్రిబాగుల వాళ్ళని భావిస్తుండాలి. అవునో కాదో ఏపీ ప్రజలే చెప్పాలి.