Pawan Kalyan JanaSena Party GHMC Electionsపోలవరం నిధుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం రాజుకున్న విషయం విదితమే. పోలవరం అంచనా విలువ రూ.20398.61 కోట్లే అని, తమకు ప్రాజెక్టు లో అతిపెద్ద ఖర్చయిన భూసేకరణ, పునరావాసంతో సంబంధం లేదని కేంద్రం మాట మార్చింది. దీనిపై బీజేపీ మిత్రపక్షం జనసేన సన్నాయి నొక్కులు నొక్కడం విశేషం.

ఇప్పటివరకూ ఈ విషయంపై పవన్ కళ్యాణ్ స్పందించలేదు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించాలని కోరుతూ జనసేన పార్టీ ఒక ప్రకటన చేసింది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ, 2019 వరకూ పాలించిన టీడీపీ స్వార్థపూరితంగా వ్యవహరించడం వల్లే ప్రతిష్టంభన నెలకొందని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ కందుల దుర్గేష్ పేరిట ప్రకటన విడుదల చేశారు.

కేంద్రం మాట మారిస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించడం ఏంటో? పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించాలని కోరడం మరో దారుణం. పోలవరం అనేది ఆంధ్రప్రదేశ్ హక్కు… విభజన వల్ల రాష్ట్రానికి జరిగిన ఒకే ఒక్క మేలు. మా హక్కు అనకుండా బ్రతిమాలుకోవడం ఏంటో? పొత్తు కోసం పవన్ కళ్యాణ్ రాజీ పడిపోయినట్టు ఉన్నారు.

కేసుల గురించి వైఎస్సార్ కాంగ్రెస్ పోరాడటం లేదు అని ఆరోపిస్తే రాజకీయ లబ్ది కోసం పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు అని ఎవరైనా అంటే కాదు అని గట్టిగా అనలేని పరిస్థితి. ఈ విషయంలో మెతక వైఖరి వల్ల కేంద్రంలోని బీజేపీ పెద్దల మెప్పు పవన్ కళ్యాణ్ పొందుగాక ప్రజా క్షేత్రంలో మాత్రం నష్టపోతారు.