Chandrababu Naidu - Andhra Pradesh Districts Divisionపోలవరానికి సంబంధించి కొత్త వివాదం బయల్దేరింది. ఇప్పటికే అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం 2014 జూన్‌ వరకు తమ వాటాగా 5,135 కోట్లు ఖర్చు పెట్టామని, భారత ప్రభుత్వం 7500 కోట్లు ఇవ్వాల్సి ఉండగా రు. 4500 కోట్ల వరకు విడుదల చేసిందని చెప్పారు. 3217 కోట్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయన్నారు.

అయితే కేంద్రం పదమూడువేల కోట్లు ఇచ్చిందని గడ్కరిచెప్పినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై రాష్ట్రప్రభుత్వం స్పందించాల్సి ఉంది. గడ్కరీ ఎప్పుడు కూడా భారీ లెక్కలు చెప్పడంలో దిట్ట. గతంలోనూ ఆంధ్రకు లక్షా ఇరవై వేల కోట్ల రోడ్డు ప్రాజెక్టులు ఇచ్చేశాం అని ప్రకటించేశారు. అయితే అవి ఎక్కడ వచ్చాయో ఎవరికీ తెలీదు.

అయితే పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెడదాం అని చూస్తున్న ప్రతిపక్ష పార్టీలకు ఇది పదునైన ఆయుధం అవుతుంది. మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 2019లోపు పూర్తిచేయడం తమ లక్ష్యమని నితిన్‌గడ్కరీ స్పష్టంచేశారు. నిబంధనలకు అతీతంగా ఏదైనా ఆర్థిక మద్దతు అవసరమైతే చేయడానికీ ప్రయత్నిస్తాం. అన్ని విషయాల్లో మద్దతు ఇచ్చి ఎట్టిపరిస్థితుల్లోనూ 2019కల్లా పూర్తిచేస్తాం అని ఆయన అన్నారు.