narendra-modi-mann-ki-baat-blackదేశాన్ని గాడిన పెట్టే ఓ బృహత్తర ప్రణాళికకు ప్రధాని నరేంద్ర మోడీ సిద్ధమవుతున్నట్లుగా కనపడుతోంది. అందులో భాగంగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న ప్రధాని, తన మనసులోని భావాలను ‘మన్ కీ బాత్’లో ప్రకటించారు. ఈ ప్రసంగం ద్వారా బినామీ బాబులకు, నల్లకుభేరులకు మోడీ చాలా స్పష్టత ఇవ్వగలిగారని చెప్పవచ్చు. పెద్ద నోట్ల రద్దు విషయంలో కూడా ముందుగా మోడీ చేసిన వ్యాఖ్యలను లైట్ గా తీసుకున్న వారు, ప్రస్తుతం అమలవుతున్న తీరు చూసి అవాక్కవుతున్నారు. దీంతో ఇప్పటివరకు పుకార్లుగా భావించిన బినామీ చట్టం, క్యాష్ లెస్ ఇండియా తదితర అంశాలపై స్పష్టత ఇస్తూ ప్రధాని చేసిన ప్రసంగాలు… కేవలం ఆటవిడుపు కాదని, వాళ్ళందరికీ వార్నింగ్ అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ముందుగా పెద్ద నోట్ల రద్దుపై…
ఓ మంచి నిర్ణయం తీసుకున్న వేళ, దాన్ని అమలు చేయడంలో కొన్ని కష్టాలను ఎదుర్కొక తప్పదని, పెద్ద నోట్ల రద్దుతో సమస్యలు వస్తాయని తనకు ముందే తెలుసునని, ఈ విషయాన్ని తాను ముందే వెల్లడించి, ప్రజలను అప్రమత్తం చేశానని, మొత్తం రద్దు ప్రక్రియ పూర్తయ్యేందుకు 50 రోజులైనా పడుతుందని ఆ రోజే చెప్పానని అన్నారు. ఇండియాను 70 సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న “వ్యాధి”కి చికిత్స అంత సులువుగా రాదని, నల్లధనం రుగ్మతను పూర్తిగా తొలగించే వరకూ తాను నిద్రపోనని… నల్లధనం నియంత్రణపై తన ఉద్దేశాలను స్పష్టంగా తెలిపారు.

దేశ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని, ప్రజలు మరికొన్ని రోజుల పాటు కష్టపడ్డా, ఆపై ఎంతో సుఖపడతారని, దేశం వృద్ధి పథంలో దూసుకెళుతుందని, నోట్ల రద్దు కష్టాలను తీర్చేందుకు ఆర్బీఐ అనుక్షణం శ్రమిస్తోందని అన్నారు. ప్రజల బాధలను తాను అర్థం చేసుకున్నానని, సాధ్యమైనంత త్వరలో సమస్యంతా సర్ధుమణుగుతుందని, వ్యవస్థలోకి చాలినంత నగదును పంపే ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కేంద్రం, రాష్ట్రాలు, బ్యాంకు సిబ్బంది మరింత సమయం పాటు విధులు నిర్వహిస్తున్నారని కొనియాడారు. ప్రజలు తమ ప్రభుత్వాన్ని నమ్మారని, వారి విశ్వాసం చూస్తుంటే, తాను నల్లధనంపై విజయం సాధించినట్టే అనిపిస్తోందని అన్నారు.

క్యాష్ లెస్ వినియోగంపై…
దేశ ప్రజలు ఒక్క రూపాయిని కూడా జేబులో ఉంచుకోకుండా, దేశమంతా తిరిగి వచ్చే రోజులు త్వరలో రానున్నాయని, కరెన్సీ కాగితాలతో పని లేకుండా అందుబాటులోని సాంకేతిక పరిజ్ఞానం సహాయాన్ని ఉపయోగించుకుంటూ ఈ-బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ విధానాలను విరివిగా ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఇండియా పేమెంట్ టెక్నాలజీ దిశగా కీలకమైన ముందడుగు వేయాల్సిన సమయం వచ్చిందని ప్రతి ఒక్కరూ సాధ్యమైనన్ని ఎక్కువ చెల్లింపులను నగదు రహితంగా చేయాలని అన్నారు. కూరగాయల మార్కెట్ నుంచి బడ్డీ కొట్టు వరకూ చిన్న చిన్న దుకాణాల్లో కూడా స్వైపింగ్ మెషీన్లు వస్తున్నాయని, చిల్లర చెల్లింపులకూ కార్డునే వాడుకోవాలని, ఈ మేరకు యువత మొబైల్ బ్యాంకింగ్ ను అందిపుచ్చుకోవాలని ప్రధాని కోరారు.

కఠినతరమైన బినామీ చట్టం…
దేశ చరిత్రలోనే అత్యంత కఠినమైన బినామీ చట్టాన్ని తీసుకువస్తున్నామని, ప్రస్తుతం ప్రతిపాదనల స్థాయిలో ఉన్న దీన్ని త్వరలోనే అమల్లోకి తీసుకువస్తామని తెలిపారు. అధికంగా డబ్బును కూడబెట్టి, దానితో బినామీల పేరిట ఆస్తులను కూడబెట్టే వారి పట్ల ఈ కొత్త చట్టం కఠినంగా వ్యవహరిస్తుందని, ఎంత దగ్గరి వారైనా, ఎంత ఆశపెట్టినా, పక్క వ్యక్తి ఆస్తిని తన పేరిట ఉంచుకోవద్దని బినామీలకు పిలుపునిచ్చారు. ఒకసారి చట్టానికి పట్టుబడితే, ఆపై శిక్షలను ఎదుర్కోవాల్సి వుంటుందని, ఎలాంటి తప్పూ చేయకుండానే తమ వారికి దూరమవుతారని… ఈ చట్టం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో చెప్పకనే చెప్తూ హెచ్చరికలు జారీ చేసారు.

నల్లకుభేరులపై…
ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లెక్కల్లోకి చూపకుండా వేల కోట్ల రూపాయలను దాచుకున్న అక్రమార్కులంతా, ఇకపై అన్ని ఆటలనూ పక్కన బెట్టాలని, డబ్బు దాచుకుంటూ, వృద్ధి విఘాతకులుగా మారుతుంటే, చూస్తూ ఊరుకునే ప్రభుత్వం పోయిందని.., తాను నల్ల కుబేరులతో ఒకే మాట చెప్పదలచుకున్ననని, పేదల జీవితాలతో, దేశ ప్రగతితో ఆటలాడుకోవద్దని పిలుపునిచ్చారు. పెద్ద నోట్లను రద్దు చేసిన తరువాత అక్రమార్కులు తమదైన శైలిలో నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు ప్రయత్నించారని, ప్రతి ఒక్కరి కథా తనకు తెలుసునని, నిబంధనలకు విరుద్ధంగా ఖాతాల్లో డబ్బు దాచుకున్న ప్రతి ఒక్కరినీ చట్టం ముందు నిలుపుతామని ఒక విధమైన వార్నింగ్ ఇచ్చారు దేశ ప్రధాని.