amaravati farmers, Andhra Pradesh, Chandrababu Naidu, Amaravati Plots, TDP,Land pooling, Nelapadu Village,Ap Capital city రాజధాని నిర్మాణం కోసం 33 వేల ఎకరాల భూములను ప్రభుత్వ పరం చేసిన రాజధాని గ్రామాల రైతులకు ప్రభుత్వం, తిరిగి ఫ్లాట్లను అప్పగించాల్సింది ఉంది. ఈ ఏడాది సంక్రాంతికే రైతులకు మంజూరు చేస్తామని చెప్పిన చంద్రబాబు సర్కార్, ఆ తర్వాత ఉగాదికి వాయిదా వేసింది. అయితే ఉగాదికి కూడా కార్యరూపం సిద్ధించుకోకపోవడంతో రైతులకు ఎదురు చూపులే మిగిలాయి.

అయితే ఈ సారి మాత్రం ఎలాంటి ట్విస్ట్ లకు తావు లేకుండా స్పష్టమైన సమయంతో సహా ప్రకటించారు. దాదాపు ఆరు మాసాల పాటు కొనసాగనున్న ఈ ప్రక్రియకు ఈ నెల 20వ తేదీ అంటే సోమవారం నాడు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. సాయంత్రం 4 గంటలకు నేలపాడు గ్రామంలోని రైతులకు లాటరీ పద్ధతిలో ప్లాట్ల పంపిణీ జరుగుతుందని సీఆర్డీఏ కమీషనర్ శ్రీకాంత్ స్పష్టం చేసారు. ఈ సందర్భంగా గ్రామస్తులంతా హాజరు కావాలని స్థానికంగా ప్రచారం చేసారు. దీంతో రైతుల నిరీక్షణకు తెరపడినట్లయ్యింది.

దఫాల వారీగా మిగిలిన అన్ని గ్రామాలలో ఇదే ప్రక్రియ కొనసాగనుండగా, ప్రభుత్వానికి భూములను భూసమీకరణ పద్దతిన ఇవ్వనటువంటి 1600 ఎకరాలను భూసేకరణ చట్టం ఉపయోగించి తీసుకోనున్నామని, వీరికి భూసేకరణ చట్టం ప్రకారమే చెల్లింపులు జరుగుతాయని విశ్వసనీయమైన సమాచారం. మొత్తానికి అమరావతి నిర్మాణం మరో అడుగు ముందుకు వేయడానికి సంకేతాలుగా ఈ ప్రక్రియను చెప్పుకోవచ్చు.