Piyush Goyal - Budget -2019ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పేరిట తెలంగాణాలో అమలవుతున్న రైతు బంధు వంటి పథకం కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌ లో ప్రకటించింది. పెట్టుబడి సాయంగా ఐదు ఎకరాల్లోపు ఉన్న రైతులకు ఏడాదికి ఆరు వేల రూపాయల నగదు సాయం ప్రకటించింది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రకటించారు. అయితే తెలంగాణలో అమలు అవుతున్న రైతు బంధుకు దీనికీ చాలా తేడా ఉంది.

కేంద్ర పథకం కేవలం చిన్న, సన్నకారు రైతులకు ఐదు ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే. అయితే తెలంగాణాలో మాత్రం దీనికి లిమిట్ లేదు. 100 ఎకరాలు ఉన్న వారికి కూడా దీనిని వర్తింప చేశారు. కేంద్రం పెట్టిన ఈ కండిషన్ ఒక రకంగా మంచిదే. అర్హులకే సాయం అందుతుంది. తెలంగాణలో ఎకరానికి ఏడాదికి 8000 ఇస్తుండగా కేంద్ర ప్రభుత్వం 6000 మాత్రమే ఇవ్వబోతుంది. తెలంగాణాలో ఇది తొందరలో 10000 కు పెరుగుతుంది. తెలంగాణతో పోలిస్తే ఇది తక్కువ. ఇది రైతులకు కొంత అసంతృప్తి కలిగించేదే.

అదే సమయంలో తెలంగాణలో రెండు విడతలలో సొమ్ము ఇస్తుంది. కేంద్రం మాత్రం మూడు విడతలలో ఇవ్వబోతుంది. అంటే ప్రతీ నాలుగు నెలలకు రెండు వేల రూపాయిలు రైతుల అకౌంటులో వెయ్యబోతుంది. ఇది రైతుల సాగుకు పెట్టుబడిగా ఉపయోగపడే అవకాశం చాలా తక్కువ. కొన్ని ప్రతిబంధకాలు ఉన్నా రైతులకు ఎంతో కొంత మేలు జరుగుతుందని మనం భావించాలి. గుడ్డి కంటే మెల్ల మేలు కదా? ఎన్నికల సమయంలోనైనా రైతులు గుర్తు రావడం మంచిదే. తెలంగాణ ప్రభుత్వం లాగానే కేంద్ర ప్రభుత్వం కూడా కౌలు రైతులను పూర్తిగా విస్మరించింది.

మరోవైపు తెలంగాణతో పాటు ఇటువంటి స్కీంలు అమలు చేస్తున్న రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న డబ్బుతో కలిపి ఈ పథకాన్ని అమలు చేస్తే వాటికి కొంత ఆర్ధిక వెసులుబాటు కలుగుతుంది. అయితే దీనికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటుందో లేదో చూడాలి. పైగా ఇది ఎన్నికల సంవత్సరం కావడంతో మాదంటే మాది అంటూ కొట్టుకోవడం మాములే. ఈ పథకానికి దాదాపుగా 75000 కోట్లు అవసరం అవుతాయని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. డిసెంబర్ నుండే అమలు లోకి తెచ్చినట్టు తెలిపింది.