Piyush Goyal about RRRప్రపంచ వ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ విడుదలై అన్ని సినిమాల రికార్డులను బ్రేక్ చేస్తూ వసూళ్ల సునామీని సృష్టిస్తుంది. ఆర్ఆర్ఆర్ వసూళ్లను చూసి ఇటు సినీ ఇండస్ట్రీయే కాదు అటు రాజకీయ నాయకులు నోరెళ్ళ బెడుతున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంట్లో మాట్లాడుతూ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దేశ పార్లమెంట్ లో ‘ఆర్ఆర్ఆర్’ వసూళ్ల సునామి గురించి ప్రస్తావన తీసుకువచ్చారు పీయూష్ గోయల్. ఏ విధంగా అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తుందో అదే విధంగా భారతదేశ ఆర్ధిక వ్యవస్థ కుడా రానున్న రోజులలో రికార్డులు సృష్టిస్తుందని వ్యాఖ్యానించారు. 2021-22 ఆర్ధిక సంవత్సరానికి భారత ఎగుమతుల సంఖ్య 418 బిలియన్లకు చేరుకోవడం పై వాణిజ్య శాఖ మంత్రి గోయల్ హర్షం వ్యక్తం చేశారు.

ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదలై 10 రోజులలోనే దాదాపు 800 కోట్ల వసూళ్లను కొల్లగొట్టింది. ఈ కలెక్షన్ల రీసౌండ్ పార్లమెంట్ ను తాకిందనడంలో ఎటువంటి సందేహం లేదు. నానాటికి తెలుగు సినిమా తన స్థాయిని., పరిధిని పెంచుకుంటూ పోతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

బీజేపీ నాయకులకు తెలుగు సినిమాల పై రోజురోజుకి ఆసక్తి పెరుగుతున్నట్లుగా.., మొన్న పుష్ప సినిమాలో “తగ్గేదేలే” అన్న డైలాగ్., సమత మూర్తి విగ్రహ ఆవిష్కరణలో స్వయానా ప్రధాని నరేంద్ర మోదీ నోటి నుంచి తెలుగు సినిమా మాట., ఇప్పుడు కేంద్ర మంత్రి నుంచి ఆర్ఆర్ఆర్ సినిమా కలెక్షన్ల మోత…, మొత్తానికి టాలీవుడ్ కి మహర్దశ పట్టినట్లుంది అంటున్నారు టాలీవుడ్ పెద్దలు.