Petrol Diesel Prices in Andhra Pradeshగొప్పలు చెప్పడం మాటల వరకే. చేతలకు వచ్చే సరికి చూపించని తత్త్వం. ఇలాంటివి ప్రభుత్వాలకు చాలా ఇబ్బందికరంగా మారుతుంటాయి. సంక్షేమమే మా లక్ష్యం…అభివృద్ధే మా ధ్యేయం అంటూ దేవుడి బిడ్డ పాత్రను పోషిస్తుంటారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను తీసుకొచ్చి దేశానికే ఏపీ దిక్సూచిలా మారుతుందంటూ చెప్పడం తరచుగా ఆయన నోట వస్తున్న మాట.

అంతగా గొప్పలు చెప్పుకునే సీఎం…తాము బాదేస్తున్న పన్ను బాదుడ్ని పిసరంత తగ్గించుకునే ప్రయత్నం చేయండయ్యా అంటే ససేమిరా అంటున్నాడు. తాజాగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెట్రోల్, డీజీల్ మీద 5, 10 చొప్పున వ్యాట్ ను తగ్గించడం తెలిసిన విషయమే.

కేంద్రం తీసుకున్న నిర్ణయంతో పెట్రల్ మీద లీటరుకు రూ.5.7నుంచి 6.35 వరకు తగ్గిన పరిస్ధితి. అదే సమయంలో డీజీల్ 11.6 నుంచి 12. 88 వరకు ధర తగ్గింది. కేంద్రం ధరల్ని తగ్గించిన నేపథ్యంలో పలు రాష్ట్రాలు కూడా తమ వంతుగా వ్యాట్ తగ్గిస్తున్నట్లు ప్రకటించడంతో ప్రజలకు కొంతమేర ఉపశమనం కలిగించినట్లైంది.

దేశంలో పెట్రోల్, డీజీల్ మీద అధికంగా వ్యాట్ విధిస్తున్న రాష్ట్రంగా రాజస్థాన్ అగ్రస్థానంలో నిలిచింది. రాజస్థాన్ తర్వాత ఏపీ అత్యధికంగా వ్యాట్ వసూలు చేస్తోంది. ఏపీ ప్రభుత్వం పెట్రోలుపై 31శాతం , డీజీల్ పై 22.25శాతం అదనంగా వ్యాట్ ను విధిస్తోంది.

దక్షణాదిన ఇంధన ధరలు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువగా ఉన్నాయి. విజయవాడలో లీటర్ పెట్రోలు ధర రూ. 110.35 ఉండగా డీజిల్ ధర రూన. 96.44 ఉన్నాయి. బెంగుళూరు కంటే పెట్రోలుపై అధికంగా 9.79, డీజిపై 11.44 అధికంగా ఉంది. హైదరాబాద్ లోనూ లీటర్ పెట్రోలు రూ.108.20 ఉండగా రూ.డీజిల్ 94.62 లకు విక్రయిస్తున్నారు. కేంద్రం ఎక్సైజ్ పన్ను తగ్గించడంతో దానికి తగ్గట్లుగా ఆంధ్రప్రదేశ్ లో లీటరు పెట్రోలు పై రూ. 6.10, డీజిల్ పై రూ. 12.28 చొప్పున తగ్గాయి.

మోడీ సర్కారు పెట్రోల్, డీజిల్ మీద వ్యాట్ ను తగ్గించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతుగా ఎంతోకొంత తగ్గించాలన్ని డిమాండ్ పెరుగుతోంది. ఏపీ ప్రభుత్వ తీరు అందుకు భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తోంది. పెట్రోల్, డీజిల్ మీద వసూలు చేస్తున్న వ్యాట్ ను తగ్గించడానికి జగన్ సర్కార్ రెడీగా లేదంటున్నారు. దీనంతటికి కారణం…పెద్దెత్తున వస్తున్న ఆదాయాన్ని వదులుకోవడం ఇష్టంలేకే అన్న అభిప్రాయలు వినిపిస్తున్నాయి.

ఏడాదిన్నర కాలంలో లీటర్ పెట్రోలు ధర 38 రూపాయలు పెరిగిన వేళ…కేంద్రం కొంత మేర ధర తగ్గించేలా నిర్ణయం తీసుకున్నప్పుడు…రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో కొంత తన వంతుసాయంగా తగ్గిస్తే బాగుంటుందన్న మాట వినిపిస్తోంది. పెట్రోల్, డీజిల్ మీద వ్యాట్ తగ్గిస్తే…రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే రాజకీయ ప్రయోజనం ఏమీ ఉండదని… ఈ కారణంతోనే పెట్రోల్ డీజిల్ మీద వ్యాట్ తగ్గించడానికి సిద్ధంగా లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.

అందరూ నడిచే దారిలో నేను నడవను….నా దారిలో నేనే వెళ్తాననడం….జగన్ సర్కార్ అనుసరిస్తున్న మొండితనం. ఎక్కడాలేనన్నీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం….దేశం మొత్తం మనవైపే చూస్తోందని ప్రగాల్భాలు పలికే జగన్ గారు…సామాన్య మధ్య తరగతి ప్రజలకు కాస్తంత ఊరటనిచ్చే నిర్ణయం తీసుకోలేరా…? పెట్రోల్, డీజిల్ కేంద్రం పరిధిలోని అంశాలని ఇప్పటి వరకు చెప్పుకుంటూ వచ్చారు. మరి వీటిపై కేంద్రం వ్యాట్ ను తగ్గించింది.

రాష్ట్ర సుంకాన్ని మీరు తగ్గించలేరా? రాష్ట్రంలోని వ్యాట్ ను తగ్గించడం మీ చేతిలోనే ఉంది కదా? పప్పు బెల్లాలు పంచడానికే ఆదాయం సరిపోతుందా…? అని సామాన్య ప్రజానీకం మండిపడుతున్నారు. ఇలాగే మొండితనంగా ముందుకెళ్తే ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతుందన్న మాట బలంగా వినిపిస్తోంది…! మున్ముందు మరేం జరుగుతుంది…జగన్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిందే.