Perni-Nani-Balashowry-Vallabhaneniఒకప్పుడు రాజులు, సామంతరాజులు రాజ్యాలు పాలించుకొన్నట్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఎవరికివారు తమ జిల్లాలను, నియోజకవర్గాలను రాజ్యాలుగా చేసుకొని ఏ బిడ్డా… ఇది నా అడ్డా.. అంటూ పరస్పరం కత్తులు దూసుకొంటున్నారు. నిన్న మచిలీపట్నంలో వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరిని మాజీ మంత్రి పేర్ని నాని అనుచరులు అడ్డుకోవడమే ఇందుకు తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

పేర్ని నాని మంత్రి అయినప్పటి నుంచి క్రమంగా మచిలీపట్నంలో వైసీపీ ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తలందరినీ తన కనుసన్నలలో పనిచేసేలా నియంత్రిస్తున్నారు. దీంతో వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సుమారు రెండేళ్ళ క్రితమే సిఎం జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేసినప్పటికీ, కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిలద్రొక్కుకొనే ప్రయత్నంలో ఉన్నందున ఆయన పెద్దగా పట్టించుకోలేదు. దీంతో గత మూడేళ్ళలో పేర్ని నాని మచిలీపట్నంపై తన పట్టు మరింత పెంచుకొన్నారు. దీంతో వారిరువురి మద్య చాలా దూరం పెరిగింది. ఇద్దరూ ఒకే పార్టీకి చెందినవారైనప్పటికీ కలిసి అధికారిక కార్యక్రమాలలో పాల్గొన్న సందర్భాలు చాలా తక్కువ.

అయితే మంత్రి పదవి ఊడిపోయినప్పటి నుంచి పేర్ని నాని మళ్ళీ మచిలీపట్నంలో ప్రజల మద్య తిరగడం ప్రారంభించారు. ఇప్పుడు ఆయన కేవలం ఓ ఎమ్మెల్యే మాత్రమే కనుక ఇప్పుడు ఎంపీ బాలశౌరి ఆయనను బలంగా ఢీకొనేందుకు సిద్దం అయ్యారు.

మచిలీపట్టణంలో 33వ డివిజన్‌లో ముస్లింల శ్మశానవాటికను అభివృద్ధి చేయాలని కొందరు స్థానికులు ఎంపీ బాలశౌరికి విజ్ఞప్తి చేశారు. కనుక శ్మశానవాటికను సందర్శించాలని నిన్న బయలుదేరారు. అయితే అక్కడ దారిలో పేర్ని నాని అనుచరులు అడ్డుకొంటారని ఆయనకు ముందే ఉప్పందింది.

అయినప్పటికీ ఆయన తన అనుచరులను వెంటబెట్టుకొని అక్కడికి వెళుతుండగా ఊహించినట్లే పేర్ని నాని అనుచరులైన 33వ డివిజన్‌ కార్పొరేటర్ అస్గర్ ఆలీ, అతని అనుచరులు అడ్డుకొన్నారు. అదీ… ‘గోబ్యాక్ బాలశౌరి’ అంటూ ఓ బ్యానర్‌ ముద్రించి పట్టుకొని మరీ ఆయనను అడ్డుకొన్నారు.

అది చూసి బాలశౌరి వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “సొంత పార్టీ ఎంపీ డివిజన్‌లో పర్యటించడానికి వస్తే బ్యానర్‌ పెట్టి గో బ్యాక్ అంటూ అడ్డుకొంటారా?” అంటూ ఆయన వారిపై చిందులు వేశారు. కానీ పేర్ని నాని అనుచరులు కూడా ఏ మాత్రం తగ్గకుండా “బాలశౌరి గో బ్యాక్… గో బ్యాక్…” అంటూ నినాదాలు చేస్తూ ఆయనను ముందుకు వెళ్ళకుండా అడ్డుకొన్నారు.

అప్పుడు పోలీసులు వారిని చెదరగొట్టి ఆయనకు దారి కల్పించారు. కానీ మళ్ళీ శ్మశానవాటిక వద్ద కూడా పేర్ని నాని అనుచరుల మరో బృందం ఆయనను అడ్డుకోవడంతో కాసేపు ఇరువర్గాల మద్య వాదోపవాదాలు, తోపులాటలు జరిగాయి.

శ్మశానవాటిక సందర్శన బాలశౌరికి చేదు అనుభవం మిగల్చడంతో ఆయన పేర్ని నానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, “పేర్ని నాని… బందరు నీ అడ్డా అనుకొన్నావా? ఇది నా అడ్డా. ఇక నుంచి నేను బందరులోనే ఉంటా…నేనేమిటో చూపిస్తా. నా తడాఖా చూపిస్తా. నన్ను ఎవరు అడ్డుకొంటారో నేనూ చూస్తా. టిడిపి, బిజెపి నేతలు, ఎంపీలతో రాసుకుపూసుకు తిరిగే పేర్ని నాని సొంత పార్టీకే చెందిన నన్ను అడుగడుగునా అవమానిస్తున్నా ఇంతకాలం సహించాను. ఇకపై సహించేది లేదు. ఎంపీ దెబ్బ ఏవిదంగా ఉంటుందో రుచి చూపిస్తా,” అని బాలశౌరి శపదం చేశారు.