Perni-Naniటిడిపి అధ్యర్యంలో మంగళవారం విజయవాడలో ‘స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం-సేవ్ డెమోక్రసీ’ పేరుతో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వామపక్షాలు, ఎన్జీవో సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దౌర్జన్యాలు, అరాచకాలు పెరిగిపోతున్నాయని కనుక అందరూ కలిసికట్టుగా పోరాడాలని నిర్ణయించారు.

అఖిలపక్ష సమావేశంపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. “రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, స్వేచ్చ లేకపోతే నేడు మీరందరూ ఈ సమావేశం పెట్టుకోగలిగేవారా? చంద్రబాబు నాయుడు ఒంటరిగా మమ్మల్ని ఎదుర్కోలేకనే తాను ఆడమన్నట్లు ఆడే వామపక్షాలను కూడగట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కమ్యూనిస్టులలో కమ్యూనిజం ఏనాడో ఆవిరైపోయింది. ప్రజల కనీస అవసరాలైన కూడు, గుడ్డ, ఇల్లు సమకూరుస్తున్న సిఎం జగన్మోహన్ రెడ్డిని ఏ రోజైన మెచ్చుకొన్నారా? పేదలకు ఇళ్ళ పంపిణీ చేయబోతే అడ్డుపడుతుంటారు కూడా. వీరిని కమ్యూనిస్టులని అనగలమా? అఖిలపక్షం పేరుతో దొంగలందరూ ఒక్క గొడుగు క్రిందకి చేరుతున్నారు. ఎంతమంది కట్టకట్టుకొని వచ్చినా వైసీపీని ఓడించలేరు,” అని అన్నారు.

వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉందని చెపుతున్నప్పుడు ప్రతిపక్షాలు సమావేశం ఏర్పాటు చేసుకొంటే పేర్ని నాని ఇంతగా ఆవేశపడిపోవడం దేనికి? ఏపీని ఈ దుస్థితికి తెచ్చిన కేసీఆర్‌ రాష్ట్రంలో తన బిఆర్ఎస్‌ పార్టీని విస్తరించాలనుకొన్నప్పుడు కూడా వైసీపీ నేతలు ఇంతగా ఆవేశపడలేదే? కానీ ఏపీలో ప్రతిపక్షాలు సమావేశమైతే ఎందుకింత ఆవేశం, ఆందోళన? రాష్ట్రంలో ప్రతిపక్షాలన్నీ కట్టకట్టుకొని వచ్చినా వచ్చే ఎన్నికలలో వైసీపీకి 175 సీట్లు వస్తాయనే ధీమా ఉన్నప్పుడు ఆందోళన చెందడం ఎందుకు?

వైసీపీ నేతలందరూ ఇదేవిదంగా పైకి ఎంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ, రాష్ట్రంలో మారుతున్న ఈ రాజకీయ సమీకరణాలు, ప్రభుత్వం పట్ల ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులలో నానాటికీ పెరుగుతున్న వ్యతిరేకత, ఆర్ధిక సమస్యల కారణంగా సంక్షేమ పధకాలు కొనసాగించలేని పరిస్థితులు కనిపిస్తుండటం వంటివన్నీ వచ్చే ఎన్నికలలో తమ కొంప ముంచుతాయనే భయం, ఆందోళన ఉంది. అదే ఈవిదంగా బయటపడుతోందని చెప్పవచ్చు.