YS-Jagan-Perni-Naniబందరు పోర్టుకి మూడోసారి శంకుస్థాపన చేయడానికి ఈరోజు సిఎం జగన్మోహన్ రెడ్డి మచిలీపట్నం వచ్చినప్పుడు, ఆయన సమక్షంలోనే మాజీ మంత్రి, మచిలీపట్నం వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని, “బహుశః నాకు సిఎం జగన్‌తో ఇదే చివరి సమావేశం కావచ్చు,” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అనంతరం విలేఖరులు దీనిపై ఆయన వివరణ కోరగా, “అవును వచ్చే ఎన్నికలలో నేను పోటీ చేయదలచుకోలేదని చాలాసార్లు చెప్పాను. సిఎం జగన్‌కి కూడా చెప్పేశాను. ఇక ఈ అధికారం, పదవులు నాకు అవసరం లేదు. కానీ జగనన్న రాజకీయాలలో ఉన్నంతకాలం ఆయన వెనకే నడుస్తాను. ఆయన కోసమే పనిచేస్తాను. పార్టీలో ఫలానా పని చేయమని చెపితే అదే చేస్తాను. ఒకవేళ జగనన్న నా కొడుకు పేర్ని కిట్టుకి మచిలీపట్నం నుంచి పోటీ చేసేందుకు టికెట్‌ ఇస్తే తప్పకుండా పోటీ చేస్తాడు. ఒకవేళ కిట్టూకి టికెట్‌ ఇవ్వకపోయినా నేను, నా కుటుంబ సభ్యులు అందరూ పార్టీ జెండా మోస్తాము. జగనన్న కోసమే పనిచేస్తాము. బ్రతికినంతకాలం జగనన్న వెంటే ఉంటాము,” అని చెప్పారు.

పార్టీలో బలమైన నేతలలో పేర్ని నాని కూడా ఒకరు. అలాగే వచ్చే ఎన్నికలలో పోటీ చేయమని, తమ వారసులకు అవకాశం కల్పించాలని కోరుతున్నవారిలో పేర్ని నాని కూడా ఒకరు. కనుకనే ఈ సభావేదికపై సిఎం జగన్‌ సమక్షంలోనే పేర్ని నాని మరోసారి తన మనసులో మాట చెప్పారనుకోవచ్చు.

అయితే వచ్చే ఎన్నికలలో వైసీపీకి ఎదురీత తప్పదని, కనుక ఎన్నికలలో ఓడిపోయి, అవమానకరంగా రాజకీయాల నుంచి నిష్క్రమించడం కంటే (లేదా ఆ అవమానాన్ని తప్పించుకోవడం కోసం) సీనియర్లు అందరూ తమ వారసులకు టికెట్లు ఇప్పించుకోవాలనే ఆలోచన చేస్తున్నట్లు భావించవచ్చు. అయితే రాజకీయాల నుంచి కూడా రిటైర్‌ అవుతామని చెపితే జగనన్న వారసులకు టికెట్స్ ఇవ్వకపోవచ్చు. కనుక వారికి టికెట్లు ఇస్తే బ్రతికి ఉన్నంతకాలం జగన్‌కు సేవ చేసుకొంటామని హామీ ఇస్తున్నట్లు భావించవచ్చు.

ఈరోజు వేదికపై నుంచి పేర్ని నాని మాట్లాడుతూ, “అయ్యా జగనన్నా… నువ్వు ఏదో ఓ బటన్ నొక్కడానికి మచిలీపట్నం రావయ్యా స్వామి… మా మచిలీపట్నంలో ఒక్కసారి నీ పాదం మోపి పావనం చేయవయ్యా.. అని నేను నాలుగేళ్ళుగా బ్రతిమలాడుతున్నాను. ఎట్టకేలకు ఇవాళ్ళ వచ్చి పావనం చేశారు. మచిలీపట్నం అభివృద్ధికి జగనన్న అందించిన తోడ్పాటుకి ఆయనకు పాదాభివందనం చేయాలని ఉంది నాకు. కానీ వయసులో నా కంటే చిన్నవాడైపోయాడు కనుక జగన్‌కు చేతులెత్తి దణ్ణం పెడుతున్నాను,” అని అన్నారు. ఇంతగా పొగుడుతూ, ఇంతగా ప్రాధేయపడున్నప్పుడు ఆయన మాత్రం ఎందుకు కాదంటాడు. ముసిముసినవ్వులు నవ్వారు. కనుక పేర్ని కిట్టూ…. మీ నాన్నగారి ప్రయత్నం ఫలించిన్నట్లేరా కన్నా!