Perni Nani ఆంధ్రప్రదేశ్ కాబినెట్ సమావేశం ముగిసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని నిర్ణయించారు. కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం మీడియాతో మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంటుపై ఢిల్లీలో ఆందోళన చేసే పరిస్థితి వస్తే చేస్తాం.. ఆందోళన చేయడానికి జగన్ వెనుకాడే వ్యక్తి కాదు.. కేంద్రంపై నిరంతరం ఒత్తిడి చేస్తున్నాం అంటూ చెప్పుకొచ్చారు.

అయితే దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. “విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ను కేంద్రం బడ్జెట్ లో ప్రకటించింది. కేంద్ర కేబినెట్ దానిని ఒకే చేసింది. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్న కంపెనీ మూడు సార్లు క్షేత స్థాయిలో పర్యటించింది. ఎంఓయూ చేసుకోవడమే తరువాయి అన్నప్పుడు ఇంకా సమయం రాకపోవడం ఏంటి,” అని విమర్శిస్తున్నారు.

“విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఢిల్లీలో పోరాటం చెయ్యడానికి టైం రాలేదు సరే… ప్రత్యేక హోదా పై పోరాటానికి కూడా ఇంకా టైం రాలేదా? ఎన్నికల ముందు వస్తుందేమో?,” అంటూ ఇంకొందరు ఎద్దేవా చేస్తున్నారు. మరోవైపు… విశాఖ ఉక్కు ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది.

గత కొన్ని రోజులుగా ఆందోళనలతో విశాఖనగరం అట్టుడుకుతోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక, ప్రజా, విద్యార్థి సంఘాలు నిరసన గళం వినిపిస్తున్నాయి. బీజేపీ, జనసేన కేంద్రం తీసుకున్న నిర్ణయం కాబట్టి సైలెంట్ గా ఉంటున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ నామ మాత్రంగా మాత్రమే ఆందోళనలలో పాల్గొంటుంది.