perni nani press meet about bheemla nayak“భీమ్లా నాయక్” సినిమా ధియేటర్ల చుట్టూ పోలీస్, రెవెన్యూ, సీఆర్ఫీఎఫ్ బలగాలను నియమిస్తూ తీసుకున్న చర్యలు సినీ ప్రేక్షకుల ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రభావంతోనే గుడివాడలో కనిపించిన ఇద్దరు మంత్రులను అభిమానులు అడ్డుకున్నారు. అయితే వైసీపీ పైన వస్తోన్న ఈ ఆరోపణలను తిప్పికొడుతూ పేర్ని నాని మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.

“భీమ్లా నాయక్ సినిమాను తొక్కేసామంటూ ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారని మండిపడిన నాని, అసలు పవన్ కళ్యాణ్ సినిమాను మేము పట్టించుకోలేదని, 2014లో గానీ, 2019 గానీ పవన్ కు అసలు ప్రాధాన్యత ఇవ్వలేదని, అలాగే 2024లో కూడా మేము పట్టించుకోమని, కొత్త జీవో వచ్చిన తర్వాత రిలీజ్ చేసుకోవచ్చు కదా, గతంలో చాలా సార్లు వాయిదా వేసుకున్నారు” అంటూ మంత్రి నాని చెప్పుకొచ్చారు.

“ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు టికెట్లను అమ్మాల్సి ఉందని, అలా కాకుండా చట్ట వ్యతిరేకంగా టికెట్లు అమ్ముతామంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, దానిని కంట్రోల్ చేస్తుందని అన్నారు. నిజానికి కొత్త జీవో 23 లేక 24వ తేదీన జారీ చేయాల్సి ఉంది. కానీ మా సహచరుడు గౌతమ్ రెడ్డి మరణించిన నేపథ్యంలో అందరూ తీవ్ర దుఃఖంలో ఉండి జీవో చేయలేదని” అన్నారు.

“సినిమాలను కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారని, మైక్ పట్టుకుంటే నీతులు చెప్పే హీరో నీతిమాలిన పనులు చేస్తున్నాడని” పవన్ కళ్యాణ్ పై తీవ్రంగా స్పందించారు నాని. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు మరియు మరికొన్ని టీవీ ఛానెల్స్ కూడా బ్లాక్ లో సినిమా టికెట్లు అమ్మడాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు చేసారు.

గౌతమ్ రెడ్డి మరణంతో పార్టీ వారంతా తీవ్ర ఆవేదనలో ఉన్నారని, ఇప్పుడు కూడా గతి లేక తాను మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు నాని. ఇంత బాధలో ఉన్న నాని, నిజంగా గుడివాడలో నేడు జీ3 ధియేటర్ ను ఓపెన్ చేయడానికి వెళ్లడం నిజంగా గొప్ప విషయమంటూ పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా నానికి కితాబిస్తున్నారు.

సినిమాను తొక్కేయడానికి ఏ రకమైన ప్రయత్నం చేయలేదని చెప్పిన నాని, మరి ధియేటర్ బయట ప్రభుత్వ అధికారులు, పోలీసులు ఎందుకు పహారా కాసారో కూడా వివరిస్తే బాగుండేది. అలాగే రెగ్యులర్ ప్రదర్శితమయ్యే హాల్స్ దగ్గరికి ‘భీమ్లా నాయక్’ రిలీజ్ కు ఒక రోజు ముందే ప్రభుత్వ అధికారులు ఎందుకు వెళ్లి మళ్ళీ సందర్శించారో కూడా కాస్త వివరిస్తే ప్రజలకు అర్ధమయ్యేది.

మీడియా ముందుకు వచ్చినపుడల్లా ప్రజలకు అర్ధమయ్యేలా ఏదొక “స్టోరీ”ని చెప్పి ఆకట్టుకోవడం పేర్ని నానికి అలవాటు. గతంలో తండ్రి కొడుకుల కధ, అలాగే ఇటీవల మరో కధను చెప్పి, విషయాన్ని ప్రేక్షకులకు సరిగా చేరవేయడంలో నేర్పరి అయిన నాని, ఈ సారి మాత్రం ఎలాంటి కొత్త కధలను చెప్పకపోవడం గమనించదగ్గ విషయం. ఏతావాతా చెప్పొచ్చేది ఏమిటంటే… “భీమ్లా నాయక్” సినిమాను జగన్ సర్కార్ తొక్కేయలేదంట… పవన్ ఫ్యాన్స్ మీకర్ధమవుతోందా..?!