perni nani manchu vishnu tweetఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు పేర్ని నాని నేడు మంచు మోహన్ బాబు, విష్ణులను కలిసిన విషయం మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యిందన్న విషయం తెలిసిందే. పేర్ని నాని కలిసిన విషయాన్ని స్వయంగా విష్ణునే ట్విట్టర్ ద్వారా ఓ ఫోటోను పెట్టి తెలియజేసారు.

అయితే ఆ ట్వీట్ లోని కంటెంట్ వివాదానికి అసలు కారణంగా మారింది. మంత్రి పేర్ని నాని గారిని కలుసుకోవడం జరిగింది, ఇటీవల జరిగిన తాజా పరిణామాలు చర్చించుకోవడం జరిగింది, వాటికి సంబంధించిన అప్ డేట్స్ ను తెలియజేశారంటూ ఓ ట్వీట్ వేసారు మంచు విష్ణు.

ఇది నేరుగా జగన్ ప్రభుత్వానికి సెగ తగిలింది. ప్రభుత్వంతో జరిపిన చర్చలను వ్యక్తిగతంగా కలిసిన సందర్భంలో చర్చించడం ఏమిటన్న అంశం హాట్ టాపిక్ గా మారి, సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. దీనిపై ఏకంగా పేర్ని నాని కూడా వివరణ ఇచ్చుకున్నారంటే, విష్ణు చేసిన ట్వీట్ ఎంత కలకలం రేపిందో అర్ధం చేసుకోవచ్చు.

అయితే ఆ ట్వీట్ ను విష్ణు డిలీట్ చేసి, మరో ట్వీట్ వేసారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది, ఇప్పటికి స్క్రీన్ షాట్ రూపంలో ఇంకా సోషల్ మీడియాలో మంచు విష్ణు చేసిన ఘనకార్యపు ట్వీట్ సర్క్యులేట్ అవుతూనే ఉంది.

ఏర్పడిన వివాదంపై పేర్ని నాని వివరణ ఇస్తూ… ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలలో ఏ ఒక్కరికి వ్యక్తిగతంగా తెలియజేయడం జరగదని, అసలు ఇలాంటి భావన ఎలా కలిగిందని తెలుసుకుని, మంచు విష్ణుకు ఫోన్ చేసి ‘అలా ట్వీట్ చేసారా?’ అని అడిగానని, ఆ ట్వీట్ డిలీట్ చేసి మరొక ట్వీట్ వేసినట్లుగా విష్ణు తెలిపినట్లుగా పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు.

తనకు ముందుగా తెలిసి ఉంటే నిన్న సమావేశానికి తాను కూడా వచ్చేవాడినని మంచు మోహన్ బాబు చెప్పినట్లుగా పేర్ని నాని తెలిపారు. తనకు ఎలాంటి సమాచారం లేదని మోహన్ బాబు చెప్పారని, ఇదే విషయాన్ని జగన్ గారికి తెలియపరచమని చెప్పినట్లుగా కూడా నాని ఈ వివరణలో తెలిపారు.