వైసీపీలో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడుని, పవన్ కళ్యాణ్‌ని తిట్టడానికి ఎందుకు పోటీలు పడుతున్నారు?అంటే తమ అధినేత సిఎం జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవడానికే అని వేరే చెప్పక్కరలేదు. అయినా ఈ పోటీలో ఎప్పుడూ ముందుండే పేర్నినాని, కొడాలి నాని వంటివారిని జగన్ ఎందుకు పక్కన పెట్టేశారు? వారికి రీప్లేస్‌మెంట్‌గా వచ్చి చంద్రబాబు, పవన్‌లను తిట్టే బాధ్యత తీసుకొన్న ఆర్‌కె.రోజా, అంబటి రాంబాబులకు భవిష్యత్తులో అదే గతి పట్టబోతోందా?బొత్స సత్యనారాయణను జగన్ ఎందుకు పక్కన పెట్టలేదు?
ఈ ప్రశ్నలకు మాజీ జనసేన నేత, ప్రముఖ న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర తనదైన శైలిలో విశ్లేషించి జవాబులు చెప్పారు.
యూట్యూబ్‌లో ఆయన కామనర్ లైబ్రెరీ అనే పేరుతో వీడియోలు పెడుతుంటారు. తాజా వీడియోలో ఇదే అంశంపై విశ్లేషిస్తూ, “కాపు సామాజిక వర్గానికి చెందిన బొత్స సత్యనారాయణ కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను విమర్శించేవారు కానీ ఏనాడూ తన హోదాను, పరిధిని దాటి పేర్ని, కొడాలి నానిలా నోటికి వచ్చిన్నట్లు మాట్లాడలేదు. కానీ మంత్రిగా అవకాశం లభించినప్పుడు పేర్ని నాని శాఖా పరంగా ఏవిదంగా అభివృద్ధి చేస్తున్నారో చెప్పుకొని ఉండి ఉంటే హుందాగా ఉండేది. త్వద్వారా జగన్ ప్రభుత్వానికి మంచిపేరు వచ్చి ఉండేది.
కానీ పేర్ని నాని తాను జగన్ విధేయుడినని నిరూపించుకోవడం కోసం జగన్ ఇంట్లో పాలేరువంటివాడినని నిసిగ్గుగా చెప్పుకోవడం ద్వారా తన స్థాయిని తానే తగ్గించుకొన్నారు. జగన్ మెప్పు కోసం ఎంతసేపు పవన్ కళ్యాణ్‌ని తిట్టిపోస్తే చాలనుకొన్నారు కానీ మంత్రిగా తన సమర్దత నిరూపించుకోవాలని ప్రయత్నించలేదు. అందుకే మంత్రిస్థాయి నుంచి పాలేరు స్థాయికి అక్కడి నుంచి ప్లీనరీలో వైసీపీ స్టిక్కర్లు కట్ చేసే స్థాయికి దిగజారిపోయారు.
పేర్ని, కొడాలి నానికి ఎదురైన ఈ దుస్థితిని చూస్తున్నా నేటికీ కొందరు వైసీపీ మంత్రులు అదే తప్పు చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. పవన్ కళ్యాణ్‌ను తిట్టడం వలన ఆయనకు ప్రజలలో.. ముఖ్యంగా కాపు ప్రజలలో ఇంకా సానుభూతి పెరుగుతుందే తప్ప పవన్‌కు వచ్చే నష్టం ఏమీ ఉండదని వైసీపీ మంత్రులు గ్రహిస్తే మంచిది.
అంబటి రాంబాబు గురించి ప్రస్తావిస్తూ, “ఆడియో టేపులలో అడ్డంగా దొరికిపోయినప్పటికీ జగన్ ఆయనకు ఏమి చూసి మంత్రి పదవి ఇచ్చారో తెలీదు. బహుశః చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను తిట్టడానికే ఇచ్చారేమో? కానీ ఆయన పవన్ కళ్యాణ్‌ను తిడుతూ కూర్చోంటే ఏదో ఓనాడు ఆయనకీ పేర్ని, కొడాలికి పట్టిన గతే పడుతుందని మరిచిపోకూడదు. కనుక పవన్ కళ్యాణ్ తిట్టడంలో చూపుతున్న శ్రద్ద పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడంలో చూపితే ఆయనకే మంచిది,” అని తన వీడియోలో అభిప్రాయం వ్యక్తం చేశారు.
కానీ పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేనని మంత్రి అంబటి రాంబాబు చేతులెత్తేసిన విషయం కళ్యాణ్ దిలీప్ సుంకరకి తెలిసినట్లు లేదు. ఎలాగూ పోలవరం ప్రాజెక్టులో చేసేందుకు ఏమీ లేదు కనుక ఆయన కూడా చంద్రబాబు నాయుడుని, పవన్ కళ్యాణ్‌ను తిడుతూ కాలక్షేపం చేస్తున్నారు.