Perni_Nani_YSRCP_Ex_Ministerఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు ఇప్పుడు కాపుల చుట్టూ తిరుగుతుండటం విశేషం. వంగవీటి రంగ వర్ధంతి, ముద్రగడ పద్మనాభం సిఎం జగన్‌కి లేఖ వ్రాయడం, కాపుల కోసం జనవరి 2 నుంచి హరిరామ జోగయ్య నిరవదిక దీక్ష, టిడిపి, జనసేనలు కాపు నేతలతో సమావేశాలు వంటివన్నీ వైసీపీకి ఆందోళన కలిగించేవే.

మాజీ మంత్రి పేర్ని నాని నిన్న ఈ పరిణామాలపై స్పందిస్తూ “రాష్ట్రంలో కాపులందరూ ఏకం కావడం మంచిదే. అలాగే రాష్ట్రంలో అన్ని వర్గాలను కలుపుకుపోగల కాపు నేత ముఖ్యమంత్రి అయితే మంచిదే. కాపులు రాజ్యాధికారం కోరుకోవడం తప్పు కాదు. అయితే వారికి సిఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు. అన్ని విదాల తోడ్పడుతున్నారు. కనుక ఆయన నాయకత్వంలో కాపులందరూ ఏకమైతే ఇంకా బాగుంటుందని నేను భావిస్తున్నాను,” అని అన్నారు.

మరో 30 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉండాలని, ఉంటారని వైసీపీ నేతలందరూ చెప్పుకొంటున్నప్పుడు, పేర్ని నాని ‘కాపు ముఖ్యమంత్రి’ అంటూ మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తుంది. రాష్ట్రంలో కాపులు తమ అధినేతకి వ్యతిరేకంగా ఏకం అవుతున్నారని పేర్ని నాని గ్రహించినట్లే ఉన్నారు.

కానీ కాపు ముఖ్యమంత్రి అయితే మంచిదే అంటూ మాట్లాడినందున పార్టీ నేతలకి, తన అధినేతకి ఆగ్రహం కలిగించవచ్చు. ‘కాపు ముఖ్యమంత్రి అయితే మంచిదే కానీ సిఎం జగన్‌ కింద పనిచేస్తే బాగుంటుందంటూ పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు కాపు నేతలకి కూడా ఆగ్రహం కలిగించవచ్చు. అదే కనుక జరిగితే పేర్ని నాని భారీ మూల్యం చెల్లించవలసి రావచ్చు. సిద్దమేనా నాని గారు?