Perni- Nani fires on police officials‘మాట తీరులలో వైసీపీ మంత్రుల మాట తీరు వేరయా’ అన్న చందంగా ఉంది ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి. ముఖ్యమంత్రి జగన్ గారు ఒక్కో మంత్రికి ఒక్కో శాఖా కేటాయిస్తే ఆ మంత్రులు మాత్రం ఒక్కో బిరుదును సంపాదించుకున్నారు. ఒక మంత్రి బూతుల మంత్రిగా కీర్తి గడించగా, మరో మంత్రి వెటకారపు మంత్రిగా… ఇలా ఒక్కొక్కరు ఒక్కో తీరుగా ప్రవర్తిస్తూ ఉన్నారు.

సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి అయిన పేర్ని నాని పోలవరం ఇంచార్జ్ నిర్వాహకుడిగా పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లి అక్కడ పోలీస్ శాఖ వారికి చాలా పద్దతిగా “మంచి- మర్యాదల” గురించి మీడియా సాక్షిగా వివరించారు. ఈ వైసీపీ మంత్రులకు పోలీస్ ఉన్నతాధికారులు అంటే ఎంత చిన్న చూపో ఈ సంఘటన చూస్తే అర్ధమవుతుంది. మొన్న సిదిరి అప్పలరాజు, ఇప్పుడు పేర్ని నాని ఇలా ఒక్కొక్కరు వారి అధికార సదరు పోలీస్ ఉద్యోగులపై చూపిస్తూనే ఉన్నారు.

పోలవరం ప్రాజెక్ట్ సందర్శనలో భాగంగా మంత్రి పేర్ని నాని తన కార్ పార్కింగ్ విషయంలో పోలీస్ ఉన్నతాధికారులతో వాగ్వాదానికి దిగారు. సీఎం పర్యటనలో భాగంగా పోలవరం వెళ్లిన నాని తన కారును రోడ్ పక్కన పార్కింగ్ చేశారు. అయితే సదరు పోలీస్ సిబ్బంది ఆ కారును అక్కడ నుండి తీయ్యమని మంత్రికి సూచించారు. అలా చెప్పినందుకు గాను నా కార్ తీయమన్నది ఎవరు అంటూ ఇక నాని గారు తనదైన శైలిలో రెచ్చిపోయారు.

తన కారును తీయ్యమన్న సి.ఐ.పై ఫైరయ్యారు. ఆ మిగతా కార్లు ఎవరివి.., మీకు “మంచి – మర్యాదలు” తెలియవా, ఇప్పుడే పండగా అయిపోలేదు ఇంకా ముందు చాలా ఉంది అంటూ తీవ్ర పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. మీడియా ఉంది అనే కనీస స్పృహ కూడా లేకుండా సదరు మంత్రి గారు తనదైన శైలిలో రెచ్చిపోవడంతో ఇక ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

అయితే ఆ వీడియో చూసిన ప్రజానీకం మాత్రం ఇందులో వింతేముంది… ఇదే కదా మన మంత్రుల “మంచి – మర్యాదలు” అని ఛలోక్తులు విసురుతున్నారు.