Perni Naniమంగళవారం సాయంత్రం మచిలీపట్నంలో జనసేన పార్టీ 10వ ఆవిర్భావసభ జరుగబోతోంది. ఈ సభకు సుమారు లక్షమందికి పైగావస్తారని జనసేన నేతలు అంచనా వేస్తున్నారు. కనుక ఆ లెక్కనే భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే జనసేన సభపై కృష్ణా జిల్లా పోలీసులు అనేక ఆంక్షలు విధించారు. జాతీయ రహదారిపై ఎటువంటి ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించరాదని, రోడ్ షోలు, సభలకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ జాషువా చెప్పారు.

పోలీస్ యాక్టివ్‌గా: 30 ప్రకారం ఈ నిబందనలను అతిక్రమించినవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకొంటామని స్పష్టం చేశారు. కానీ పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా సభను విజయవంతం చేస్తామని జనసేన నేతలు చెపుతున్నారు. కనుక రేపు సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కార్యాలయం నుంచి పవన్‌ కళ్యాణ్‌ తన వారాహిలో వేలాదిమంది కార్యకర్తలు తరలిరాగా ఊరేగింపుగా బయలుదేరనున్నారు. ఒకవేళ వారిని పోలీసులు అడ్డుకొనే ప్రయత్నం చేస్తే అనూహ్య పరిణామాలు జరిగే అవకాశం ఉంది.

పవన్‌ కళ్యాణ్‌ రాష్ట్రంలో పర్యటిస్తే వైసీపీ నేతలు నోటికి పనిచెప్పడం పరిపాటి. పవన్‌ కళ్యాణ్‌ పార్టీ ఆవిర్భావసభలో పాల్గొనేందుకు వచ్చి రోజూ పార్టీ నేతలు, వివిద కులసంఘాల నేతలతో మాట్లాడుతున్నారు కనుక మళ్ళీ వైసీపీ నేతలకు పని పడింది.

మాజీ మంత్రి పేర్ని నాని, ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, “పవన్‌ కళ్యాణ్‌కి దమ్ముంటే 2014 నుంచి 2019 వరకు టిడిపి ప్రభుత్వం ఏమి చేసిందో అదే చేస్తుందని చెప్పమని సవాలు విసురుతున్నాను. టిడిపి, జనసేనలు కొత్తగా ఇచ్చేందుకు ఏమున్నాయి? ఏమీ లేవు కనుకనే మా ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పధకాలనే అమలుచేస్తామని చెప్పుకొంటున్నారు.వాటినే అమలుచేసే మాటైతే మీరెందుకు? సిఎం జగన్మోహన్ రెడ్డే అమలుచేస్తారు కదా?

అయినా పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాలకు పనికిరాడు. ఆయనకి నిబద్దత లేదు. ఆయన మాట్లాడేవన్నీ ఒట్టి సినిమా డైలాగులే తప్ప వాటిలో ఎటువంటి నిబద్దత కనిపించదు. కనీసం చంద్రబాబు నాయుడుకి ఉన్నంత నిబద్దత కూడా పవన్‌ కళ్యాణ్‌లో కనిపించదు. పవన్‌ కళ్యాణ్‌ కంటే చంద్రబాబు నాయుడే చాలా బెటర్..ఎంతో కొంత నిబద్దత ఉంది. కానీ పవన్‌ కళ్యాణ్‌ అసలు ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలీదు,” అని అన్నారు.

రాజకీయాలంటే అధికారంలో ఉండటమే అనుకొనే వైసీపీ నేతలు నిబద్దత గురించి మాట్లాడితే చాలా విడ్డూరంగా ఉంటుంది. ఒకవేళ వైసీపీ ప్రభుత్వానికి రాష్ట్రం పట్ల, ప్రజల పట్ల నిబద్దత ఉండి ఉంటే, నేటికీ రాజధాని ఏదో చెప్పుకోలేని దుస్థితిలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఉండేదే కాదు. ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు జీతాల కోసం రోడ్లెక్కి ధర్నాలు చేసేవారే కారు. గవర్నర్‌ వద్దకు వెళ్ళి మొరపెట్టుకొనేవారే కారు. ఇటువంటి దుస్థితిలో ఉన్న ఏపీలో పారిశ్రామికవేత్తలు రూ.13.56 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టి 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించబోతున్నారని ప్రభుత్వం మభ్యపెట్టి ఉండేదే కాదు.

ఒకే స్టీల్ ప్లాంటుకు రెండుమూడుసార్లు భూమిపూజలు చేస్తూ కాలక్షేపం చేసేదే కాదు. కానీ ఇన్ని వైఫల్యాలు కనబడుతున్నా తమ ప్రభుత్వం అంత నిబద్దత మరెవరికీ లేదని సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకోవడం పేర్ని వారికే చెల్లు. కానీ పవన్‌ కళ్యాణ్‌ని రెచ్చగొట్టేందుకైనా చంద్రబాబు నాయుడుకి నిబద్దత ఉందని పేర్ని నాని ఒప్పుకొన్నారు. ఎందుకంటే అది వాస్తవమే కనుక!