Perni Nani Comments On BRS Party Andhra Pradeshమాజీ మంత్రి పేర్ని నాని తెలంగాణ మంత్రులపై నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని నిలువునా ముంచేస్తూ మళ్ళీ ఏ మొహం పెట్టుకొని కేసీఆర్‌ ఏపీకి వస్తారని ప్రశ్నించారు. నేటికీ ఏపీకి చెల్లించాల్సిన విద్యుత్‌ బకాయిలు, ఆస్తుల పంపకాలు చేయకుండా నామం పెడుతున్న కేసీఆర్‌ ఏపీని ఉద్దరించడానికి రావాలనుకోవడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల నుంచి కరెంటు దొంగతనం చేస్తున్నది బిఆర్ఎస్‌ ప్రభుత్వమే అని పేర్ని నాని ఆరోపించారు.

ఓ పక్క ఏపీకి ఈవిదంగా వెన్నుపోటు పొడుస్తూ, ఏపీ ప్రయోజనాలను దెబ్బ తీస్తూ మళ్ళీ ఏపీలో పోటీ చేస్తామని, తమని గెలిపిస్తే ఏపీని అభివృద్ధి చేస్తామని మంత్రి మల్లారెడ్డి చెప్పడాన్ని పేర్ని నాని తీవ్రంగా ఆక్షేపించారు. అసలు కేసీఆర్‌ ఆలోచనలు వాటి రాజకీయ పరిణామాలతో బిఆర్ఎస్‌లో అందరూ ఏ క్షణంలో ఏమవుతుందో అని భయపడుతున్నారని పేర్ని నాని అభిప్రాయం వ్యక్తం చేశారు. సొంత రాష్ట్రంలో, సొంత పార్టీలో భద్రతలేని బిఆర్ఎస్‌ నేతలు ఏపీలో ఎవరిని ఉద్దరించాలని వస్తున్నారని పేర్ని నాని ప్రశ్నించారు. అయితే ఏపీలో ఎన్ని పార్టీలు వచ్చినా ప్రజలు సిఎం జగన్మోహన్ రెడ్డిని మాత్రమే నమ్ముతున్నారని కనుక ఏపీకి బిఆర్ఎస్‌ వస్తే దానికే ఎదురుదెబ్బ తగులుతుందేమో ఆలోచించుకొంటే మంచిదని పేర్ని నాని హితవు పలికారు.

ఏపీలో రాజకీయ శూన్యత ఉండి ఉంటే కేసీఆర్‌ ఇటువంటి ఆలోచనలు చేసినా కొంత అర్దముండేది కానీ ఏపీలో వైసీపీ, టిడిపి రెండు పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. ఈ మద్యకాలంలో జనసేన కూడా బాగానే బలపడుతోంది. కనుక బిఆర్ఎస్‌ పార్టీ ఏపీకి వస్తే దానిని తీసుకువచ్చినవారి పలుకుబడి, పెట్టుబడిని బట్టి అది ఏపీలో నాలుగు ప్రధాన పార్టీల ఓట్లు చీల్చి నష్టపరచగలదేమో కానీ 175 సీట్లకు పోటీ చేసి అధికారంలో రాలేదు. రాగలమనుకొంటే ఆంధ్రా ప్రజలను బొత్తిగా వెర్రిబాగులవాళ్ళగానే భావిస్తున్నట్లు అనుకోవలసి ఉంటుంది.