perni nani about tollywood ticket rate issueఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్లు అన్నీ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యబోయే పోర్టల్ ద్వారానే జరగబోతున్నట్టు వార్తలు వచ్చాయి. సినిమాకు వచ్చిన డబ్బులన్నీ ప్రభుత్వ ఖజానాకు చేరి ఆ తరువాత నెలాఖరుకు ఎవరికి రావాల్సిన వాటా వారికి ఇస్తారని పుకార్లు కూడా షికారు చేశాయి.

అయితే దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో మంత్రి పేర్ని నాని స్పందించారు. సినిమా టికెట్లను ప్రభుత్వమే అమ్మాలనే విషయంపై ఇంత వరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.

అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ అంశంపై కమిటీలు వేశామని.. అధ్యయనం జరుగుతోందని … సినీ పరిశ్రమ పెద్దలతో సమావేశమై వారి సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు.

ప్రభుత్వమే టిక్కెట్లు అమ్మితే పన్ను ఎగవేత, బ్లాక్ టిక్కెట్ల బెడద ఉండబోదని మంత్రి చెప్పుకొచ్చారు. ఇక్కడ దాకా బానే ఉంది… ప్రెస్ మీట్ చివర్లో ఒక బాంబు పేల్చారు నాని. ఆన్‌లైన్‌లో సినిమా టికెట్లు అమ్మాలని చిరంజీవి, నాగార్జున నేతృత్వంలోని సినీ ప్రముఖులే కోరారని.. సినీ పెద్దల సూచనలే ప్రభుత్వం పరిశీలించిందని మంత్రి చెప్పుకొచ్చారు.

అయితే దీని మీద సోషల్ మీడియాలోనూ… ఇండస్ట్రీలో అంతర్గతంగానూ చిరంజీవి, నాగార్జున, ఇతర సినీ పెద్దల మీద విమర్శలు వస్తున్నాయి. పరిశ్రమలోని వారంతా టిక్కెట్లు ప్రభుత్వమే విక్రయిస్తే వచ్చే ఇబ్బందులు గురించి ఆందోళనగా ఉన్న తరుణంలో చిరంజీవి, నాగార్జున ఇతర సినీ పెద్దల మీదకే ఇష్యూ డైవర్ట్ అవ్వడం గమనార్హం.

ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా పెత్తనం ఇస్తే చిరంజీవి ఇలా చేస్తారా అంటూ విమర్శలు మొదలయ్యాయి. ఇప్పుడు ఈ ఇష్యూ మీద మాట్లాడితే ప్రభుత్వంతో ఇబ్బంది… మాట్లాడకపోతే పరిశ్రమలో ఇబ్బంది.