Perni Nani about Chiranjeevi Pawan Kalyanవైసీపీలో మంత్రి పదవి ఊడిన బాధ నుంచి తాజా మాజీలు మెల్లగా కోలుకొని ఒకరొకరుగా మీడియా ముందుకు వస్తూ, మంత్రి పదవిలో నుంచి పీకేసినందుకు తామేమీ బాధ పడటం లేదని చెప్పుకొంటున్నారు. తమకు పదవులు గడ్డి పోచతో సమానమని చెపుతున్నారు. వైసీపీ తమ దేవాలయమని దానిలో కొలువైన జగన్ తమ దేవుడని ఆయనను సేవించుకొనేందుకు అవకాశం ఉంది అదే పదివేలు అంటున్నారు. ఇప్పటి వరకు పదవిలో ఉన్నందున ప్రజలకు దూరం అయ్యామని, ఇప్పుడు ‘వేరే పని లేదు కనుక’ మళ్ళీ ప్రజల వద్దకు వెళ్ళి, వచ్చే ఎన్నికలలో తమ దేవుడిని ‘అఖండ’ మెజార్టీతో గెలిపించుకొంటామని చెపుతున్నారు. ఇంతకు మించి వేరే మాట్లాడలేరు కూడా.

కడుపులో బాధ, గొంతులో ఆవేదన దాచుకొని ఈవిదంగా మాట్లాడటం మామూలు విషయమేమీ కాదు. పాపం వారిని చూస్తుంటే లోక శ్రేయస్సు కోసం గరళాన్ని కంఠంలో దాచుకొని పైకి నిర్వికారంగా ఉండే పరమ శివుడు అందరికీ గుర్తుకు వస్తున్నాడు.

మొన్నటి వరకు ఓ వెలుగు వెలిగిన తాజా మాజీ పేర్ని నాని కూడా నిన్న తాడేపల్లిలో తమ జగనన్న దేవాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ ఇంచుమించు ఇవే మాటలు చెప్పారు. కనుక ఈ చిలక పలుకులకు అదనంగా చెప్పిన మాటలేమైనా ఉంటే వాటి గురించి చెప్పుకొంటే సరిపోతుంది. పేర్నివారు కూడా మొదట జగన్ భజన పూర్తిచేసి, తరువాత రెండు ఇతర విషయాల గురించి మాట్లాడారు. 1.కేంద్రంతో పొత్తులు, 2. మెగా బ్రదర్స్ గురించి.

వచ్చే ఎన్నికలలో మళ్ళీ వైసీపీ ఒంటరిగా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచి రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. చంద్రబాబునాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతానని పగటి కలలు కంటున్నారని అన్నారు. వైసీపీని గెలిపించుకోవడం కోసం మే 2 నుంచి తాను ప్రజలలోకి వెళతానని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంలో ఏ కూటమి అధికారంలోకి వస్తే దానితో కలిసి పనిచేస్తామని చెప్పారు.

వచ్చే ఎన్నికలలో వైసీపీ అలవోకగా భారీ మెజార్టీతో గెలుస్తుందని వైసీపీ నేతలు ఇంత నమ్మకంగా చెపుతున్నప్పుడు ఎన్నికలకి ఇంకా రెండేళ్ళు ఉండగా పాలన, రాష్ట్రాభివృద్ధి గురించి ఆలోచించకుండా ఇప్పటి నుంచే ఎన్నికల గురించి ఎందుకు మాట్లాడుతునట్లు?అంటే ఎక్కడో తేడా కొడుతోందని వారికీ అర్దమైనట్లే ఉంది. వచ్చే ఎన్నికలలో మళ్ళీ గెలుస్తామో లేదో తెలియకపోయినా అప్పుడే రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంలో ఏ కూటమి అధికారంలోకి వస్తే దానితో కలిసి పనిచేస్తామని పేర్నివారు చెప్పడం ‘తొందరపడి ఓ కోయిల… పాటలా ఉంది.

మెగా బ్రదర్స్‌లో ఆచార్య దేవుడని, కానీ తమకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న తమ్ముడు మాత్రం విలన్‌ అని పేర్నివారు అన్నారు. ఆచార్యుల వారిని పొగుడుతూనే, ఆయన రాజకీయాలకు పనికిరారని గుర్తించి తట్టాబుట్ట సర్దుకొని వెళ్ళిపోయారని అన్నారు. తమను ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపోయారు కనుకనే దేవుడులాగ కనిపిస్తున్నారేమో?

కానీ విలన్‌కి మాత్రం రాజకీయాలలో వావివరుసలు, సిద్దాంతాలు లేవని, అధికారం, పదవుల కోసం దత్త పుత్రుడిగా నటించేందుకు సైతం వెనకాడటం లేదని అన్నారు. దత్తపుత్రుడు అనే కంటే బానిస, బంటు అంటే సబబుగా ఉంటుందని పేర్నివారు తమ అమూల్యమైన అభిప్రాయం వ్యక్తం చేశారు.

వైసీపీ నేతలు పగటి కలలు కంటున్న చంద్రబాబునాయుడుని, ఆయనకు దత్తపుత్రుడు లేదా బంటు అని చెపుతున్న భీమ్లా నాయక్‌ల గురించి ఇంతగా మాట్లాడుతుండటం, ఇంతగా ఆలోచిస్తుండటం చూస్తే వారిలో ఎంత అభద్రతాభావం ఉందో కనిపిస్తోంది. కనుక వారి మాటలకు వాస్తవ పరిస్థితికి పొంతన లేదని అర్దమవుతూనే ఉంది. కానీ తప్పదు…ఇక నుంచి ఎన్నికల వరకు వైసీపీ నేతల ఈ చిలక పలుకలు…జగనన్న భజనలు ఆంద్రా ప్రజలు విని తరించక తప్పదు.