Kiliveti Sanjeevaiah MLAఆంధ్రప్రదేశ్ లో కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకత ఎదురుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. కొందరు ఎమ్మెల్యేలు ప్రజలలోకి వెళ్లలేని పరిస్థితి నెలకొందని అంటున్నారు. తాజాగా అటువంటి ఘటన నెల్లూరు జిల్లా నాయుడుపేటలో చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య స్థానికంగా ఉన్న బీడీ కాలనీలో చెత్త తరలించే వాహనాల పార్కింగ్ షెడ్డును ప్రారంభించడానికి వచ్చారు.

అయితే ఎమ్మెల్యే కార్యక్రమాన్ని స్థానికులు అడ్డుకున్నారు. డౌన్ డౌన్ అంటూ స్థానికులు నినాదాలు చేశారు. దీంతో షెడ్డును ప్రారంభించకుండానే ఎమ్మెల్యే పోలీస్ వలయంలో వెనుదిరిగి వెళ్లిపోయారు. సంజీవయ్యకు ప్రజల నుండి నిరసన వ్యక్తం కావడం ఇదేమీ మొదటిసారి కాదు. తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికల ప్రచార సమయంలో మావిళ్ల పాడు గ్రామస్థులు ఆయనకు అడ్డు తగిలారు.

ఎమ్మెల్యే సంజీవయ్య ఏ గ్రామంలో అయినా ప్రచారం చేసుకునే స్వేచ్ఛ ఉందంటూ గ్రామస్థులను పరుషపదజాలంతో హెచ్చరించారు. దాంతో ఆగ్రహించిన గ్రామస్థులు ప్రచార రథం మీదకు దూసుకెళ్లారు. పోలీసులు కూడా వారిని ఆపలేకపోవడంతో చేసేదేమీలేక ప్రచారాన్ని ఉపసంహరించుకొని వెళ్లిపోయారు.

2019 ఎన్నికలలో టీడీపీ తరపున పోటీ చేసిన పరసా వెంకట రత్నయ్య పై కిలివేటి సంజీవయ్య 61,292 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. పరసా వెంకట రత్నయ్య గతంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉండటం గమనార్హం. 2014లో కూడా సంజీవయ్య ఇదే నియోజకవర్గం నుండి గెలిచారు.